Share News

Masood Azhar: 26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర

ABN , Publish Date - Nov 12 , 2025 | 05:52 PM

ఎర్రకోట వద్ద జరిగిన 10/11 బ్లాస్ట్‌లో మసూద్ అజార్ ప్రమేయంపై మరోసారి అనుమానాలు బలపడుతున్నాయి. హుండాయ్ ఐ20 కారులో నవంబర్ 10న జరిగిన పేలుడు ఘటన వెనుక జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు వెలుగుచూస్తున్నాయి.

Masood Azhar: 26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర
Masood Azhar

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నవంబర్ 10న జరిగిన బాంబు పేలుడు ఘటనతో యావద్దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడి వెనుక పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నట్టు వెల్లడవుతుండటంతో మరోసారి జైషే ఉగ్రవాది మసూద్ అజార్ (Masood Azhar) పేరు తెరపైకి వచ్చింది. భారత్‌లో పలు ఉగ్రదాడులతో ప్రమేయం ఉన్న అజార్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఐఎస్ఐ నిధులతో ఉగ్రవాదాన్ని నడిపిస్తున్న అజార్‌‌కు 26/11 ముంబై దాడుల నుంచి తాజాగా ఢిల్లీ బ్లాస్ట్ (10/11 blast) వరకూ ప్రమేయం ఉంది.


పాక్ గడ్డపై అజార్ లేడని ఆ దేశం బుకాయిస్తున్నప్పటికీ ఇస్లామాబాద్ అండదండలతో అతను స్వేచ్ఛగా పాక్ గడ్డపై తిరుగుతుండటం జగద్విదితం. ఇప్పుడు ఎర్రకోట వద్ద జరిగిన 10/11 బ్లాస్ట్‌లో ఆయన ప్రమేయంపై మరోసారి అనుమానాలు బలపడుతున్నాయి. హుండాయ్ ఐ20 కారులో నవంబర్ 10న జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 12కు చేరింది. ఈ దారుణ ఘటన వెనుక జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు వెలుగుచూస్తున్నాయి.


ఎవరీ మసూద్ అజార్

మసూద్ అజార్ (56) పాక్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు. ఇండియాలో అనేక ఉగ్రదాడులకు జైషే పాల్పడింది. అజార్‌ను భారత ఏజెన్సీలు గతంలో పట్టుకున్నప్పటికీ ఎయిర్ ఇండియా ఐసీ814 హైజాకింగ్ తరువాత అతన్ని విడిచిపెట్టారు. 1999 డిసెంబర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు ఢిల్లీ నుంచి ఖాట్మండు వెళ్తున్న ఐసీ814 విమానానాన్ని హైజాక్ చేసి అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌కు మళ్లించారు. బందీల విడుదలకు ప్రతిగా అజార్‌, మరో ఇద్దరు ఉగ్రవాదులను ఇండియా విడిచిపెట్టింది. ఆ తర్వాతే 1999-2000లో జైషే మహ్మద్ సంస్థను అజార్ స్థాపించాడు. పాకిస్థాన్‌ నుంచి ఈ ఉగ్రసంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. 2001లో పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి, 2019 పుల్వామా దాడిలో మసూద్ ఆజార్ ప్రమేయం ఉంది. తాజాగా ఢిల్లీ పేలుళ్లు ఘటనలో పలువురిని అరెస్టు చేయడంతో జైషే ప్రమేయం మరోసారి బయటకు వచ్చింది.


ఆపరేషన్ సిందూర్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మే 7న 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం కాగా, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో 10 మంది మసూద్‌ కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. ఆయన పెద్ద సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, ఆతని భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలు ఇందులో ఉన్నారు. అజార్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. తన కుటుంబసభ్యలు చనిపిపోయినందుకు తాను బాధపడటం లేదని, తాను కూడా వారితో చనిపోయి ఉండే బాగుండేదని అజర్ అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత పంజాబ్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఒక ఇస్లామిక్ సెమినరీలో భారత్‌పై దాడులు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.


మహిళా బ్రిగేడ్

కాగా, జైషే ఉగ్రవాద సంస్థ కొత్తగా జమాత్ ఉల్-మోయినాత్ అనే మహిళా బ్రిగేడ్‌‌ను ఏర్పాటు చేసింది. మహిళలను ఇందులో రిక్రూట్ చేసుకుని ఉగ్రవాదంపై శిక్షణ ఇస్తోంది. గత నెలలో పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూఖ్ భార్య అఫిరా బీబీ ఈ సంస్థ అడ్వయిజరీ కౌన్సిల్‌లో చేరింది. జైషే లింక్స్‌పై ఇటీవల ఫరీదాబాద్‌లో అరెస్టయిన మెడికల్ కాలేజీ డాక్టర్ షహీన్ సయూద్‌ ఇండియాలో జమాత్ ఉల్-మోయినాత్ యూనిట్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీ పేలుడు బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన మోదీ

ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్.. ఎలా జరిగిందో చూడండి.. సీసీటీవీ వీడియో వైరల్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 05:58 PM