Share News

Delhi Blast: ఆ మూడు గంటలు కారులో ఎందుకు ఉండిపోయాడంటే..

ABN , Publish Date - Nov 12 , 2025 | 04:05 PM

ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగా సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కీలక విషయాన్ని వారు గుర్తించారు.

Delhi Blast: ఆ మూడు గంటలు కారులో ఎందుకు ఉండిపోయాడంటే..

న్యూఢిల్లీ, నవంబర్ 12: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్దకు మధ్యాహ్నాం 3.19 గంటలకు వచ్చిన కారు.. సాయంత్రం 6.28 గంటల వరకు అక్కడే పార్కింగ్ చేసి ఉంది. అంటే దాదాపు 3 గంటల పాటు కారు అక్కడే ఉంది. అయితే ఈ సమయంలో ఉమర్ మహమ్మద్ కారులోనే ఉన్నాడు. అతడు కారు దిగడం కానీ.. డోర్ ఓపెన్ చేయడం కానీ చేయలేదని సీసీ ఫుటేజ్ ద్వారా స్పష్టమవుతుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. అతడు అంత సేపు కారులో ఎందుకు ఉండిపోయాడు? అక్కడే ఉండి పోయి.. ముందుగా అనుకున్న ప్లాన్‌ను అమలు చేయాలనుకున్నాడా? లేకుంటే మరో ఆలోచన చేస్తూ అంతసేపు అతడు అక్కడే ఉండిపోయాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


శీతాకాలం కావడంతో సాయంత్రం వేళ.. ఎర్రకోట వద్దకు భారీగా ప్రజలు చేరుకుంటారు. అందుకే అతడు కారు వెనుక సీటులో డిటోనేటర్లు పెట్టుకుని ఎర్రకోటకు వచ్చాడు. కానీ సోమవారం ఎర్రకోటకు సెలవు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని అతడు గుర్తించాడు. దీంతో కారును ఇక్కడే ఉంచాలా? లేకుంటే మరో ప్రాంతానికి వెళ్లాలా? అనే ఆలోచన ఉమర్ మహమ్మద్‌లో మొదలై ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


అలా అక్కడి నుంచి ఉమర్.. తన కారును నేతాజీ సుభాష్ మార్గ్ వైపునకు మళ్లించాడు. అలా కారు ఎర్రకోట మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్దకు చేరుకుంది. కాసేపటికే ఉమర్ ప్రయాణిస్తున్న కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 12 మంది మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు.


ఫరీదాబాద్ నుంచి రెడ్ ఫోర్డ్ వరకు ..

ఈ బాంబు పేలుడు తర్వాత దాదాపు 600 మంది పోలీసులు రంగంలోకి దిగి.. ఈ కారు ప్రయాణించిన మార్గాన్ని ట్రాక్ చేశారు. అందుకోసం దాదాపు 1000 సీసీ టీవీ ఫుటేజ్‌లను వారు పరిశీలించారు. ఆ క్రమంలో ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి సోమవారం ఉదయం హుండయి ఐ20 కారు బయలుదేరింది. అలా ఆ రోజు ఉదయం 8.13 గంటలకు హర్యానా - న్యూఢిల్లీ సరిహద్దుల్లోని భద్రాపూర్ టోల్ ప్లాజ్‌ను దాటింది. ఎర్రకోట పార్కింగ్ ప్రాంతానికి చేరుకునే క్రమంలో ఈ కారు.. మయూర్ విహార్, కన్నాట్ ప్లేస్ ప్రాంతాల మీదగా చేరుకుంది. అయితే పాత ఢిల్లీ సమీపంలోని అసఫ్ అలీ రోడ్డు వద్ద దాదాపు అరగంట పాటు కారును ఉమర్ నిలిపివేశాడు. ఆ సమయంలో సైతం అతడు కారులో ఒంటరిగానే ఉన్నాడు. అనంతరం తన కారును ఎక్కడ ఆపకుండా ఎర్రకోట వద్ద పార్కింగ్ ప్రాంతానికి చేరుకున్నట్లు సీసీ ఫుటేజ్‌లలో పోలీసులు గుర్తించారు.


కన్నాట్ ప్లేస్‌ను లక్ష్యంగా చేసుకున్నాడా?

ఉమర్ ఢిల్లీలోకి ప్రవేశించిన నాటి నుంచి అతడు పలు ప్రాంతాల మీదగా .. ఎర్రకోట వద్దకు చేరుకున్నాడు. అయితే అతడు తొలుత కన్నాట్ ప్లేస్‌ను లక్ష్యంగా చేసుకున్నాడా ? అని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా మయూర్ విహార్, అక్షరధామ్ దేవాలయం, కన్నాట్ ప్లేస్‌ల్లోని సీసీ ఫుటేజ్‌లను సైతం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక ఉదయం 8.00 గంటలకు ఉమర్ ఢిల్లీలోకి ప్రవేశించగా.. దాదాపు 11 గంటల తరువాత అంటే సాయంత్రం 6, 7 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఈ మధ్య సమయంలో అతడు ఏం చేశాడనే విషయాన్ని తెలుసుకోవడంపై పోలీసులు ఫోకస్ చేశారు.


ఇక అతడి ఫోన్‌ గురించి పోలీసులు ఆరా తీయగా.. ఇక్కడా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఉమర్ తన ఫోన్‌ను 10 రోజుల ముందే స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ ఫోన్ కూడా అల్ ఫలాహ్ యూనివర్శిటీలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఉమర్ ఫోన్ లేకుండా ఎలా ఉన్నాడు. ఈ బాంబు దాడి వెనుక ఉన్న వారి ఆదేశాలు.. ఉమర్‌కు ఎలా అందాయి అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. లేదంటే ఉమర్ వద్ద మరో ఫోన్ ఉందా? ఈ పేలుడులో ఆ ఫోన్ ధ్వంసమైందా? అని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా సైతం దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీ పేలుడు బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన మోదీ

దీపావళికి ప్లాన్ చేసి.. ఆపై విరమించుకుని...

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 04:49 PM