Chennai News: ఎన్నికల వేళ.. అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:03 AM
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణుడు మైత్రేయన్ డీఎంకేలో చేరారు.
- డీఎంకే గూటికి మాజీ ఎంపీ డాక్టర్ మైత్రేయన్
- స్టాలిన్ సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరణ
చెన్నై: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష అన్నాడీఎంకే(AIADMK)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణుడు మైత్రేయన్ డీఎంకేలో చేరారు. బుధవారం అన్నా అరివాలయానికి వెళ్లిన డాక్టర్ మైత్రేయన్.. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. స్టాలిన్ ఆయనకు సభ్యత్వ కార్డు అందజేసి, కండువా వేసి స్వాగతించారు. అన్నాడీఎంకేలో 2002 నుంచి మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా మైత్రేయన్ సేవలందించారు. ఆ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శిగాను పనిచేశారు.
గత నెల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తనకు సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం ఆయనకు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో కినుక వహించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, మంత్రులు దురైమురుగన్, ఎం.సుబ్రమణ్యం, కేఎన్ నెహ్రూ, పార్టీ ప్రముఖులు ఆర్‌ఎస్ భారతి, ఇళంగోవన్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎంపీ అన్వర్‌రాజా కూడా డీఎంకేలో చేరిన విషయం తెలిసిందే.
మైత్రేయన్ రాజకీయ పయనం...
డాక్టర్ మైత్రేయన్ మొదట బీజేపీలో చేరి తన రాజకీయ పయనం ప్రారంభించారు. 1995 నుండి 1997 వరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత జయలలిత హయాంలో 1999లో అన్నాడీఎంకేలో చేరి, రాజ్యసభ సభ్యుడిగా మూడుసార్లు ఆ పార్టీ తరపున ఎన్నికయ్యారు. పార్టీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించారు. జయ మృతి తర్వాత అన్నాడీఎంకే రెండువర్గాలుగా విడిపోయినప్పుడు మైత్రేయన్ మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వైపు నిలబడ్డారు. దీంతో ఆయన్ని పార్టీ బహిష్కరించడంతో ఆయన 2023లో మళ్ళీ బీజేపీలో చేరారు.
అయోమయంలో అన్నాడీఎంకే: మైత్రేయన్
బీజేపీతో పొత్తుపెట్టుకోవడం నచ్చక అన్నాడీఎంకే శ్రేణులు అయోమయంలో ఉన్నాయని, పార్టీ నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) నిరంకుశధోరణితో వ్యవహరిస్తున్నారని డాక్టర్ మైత్రేయన్ విమర్శించారు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ తన సేవలు ఉపయోగించుకోనందువల్లే డీఎంకే సభ్యత్వం స్వీకరించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని, విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో ఆర్థికపరంగాను అభివృద్ధి చెందినట్లు కేంద్ర ప్రభుత్వమే వెల్లడించిందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చేసిన రాష్ట్ర స్వయంప్రతిపత్తి నినాదం స్టాలిన్ నాయకత్వంలో ఆచరణాత్మకమైందని, రాష్ట్ర హక్కుల కోసం తీవ్రంగా పోరాడుతున్నారని మైత్రేయన్ ప్రశంసించారు. వచ్చే యేడాది శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందని, ఆ కూటమిని గెలిపించడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.. ఈ యేడాదే కాదు వచ్చే యేడాది కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెయింట్‌జార్జి కోటపై స్టాలిన్ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకపోయిందని, ఈపీఎస్ తొందరపడి బీజేపీతో పొత్తుపెట్టుకోవడం పలు అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అధికారంలో భాగస్వామ్యం కలిగి ఉంటామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రకటనను పార్టీకి చెందినవారెవరూ ఖండించకుండా మౌనం పాటిస్తున్నారని, దీంతో పార్టీలో అయోమయ పరిస్థితులే కొనసాగుతున్నాయని, కొంతమంది స్వార్థపరులు పార్టీని కబళించేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారని డాక్టర్ మైత్రేయన్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదు
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
Read Latest Telangana News and National News