Maharashtra: పెళ్లైన 3 రోజులకే.. ‘నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం పంపుతున్నా’.. నవవధువు
ABN , Publish Date - May 10 , 2025 | 08:01 PM
Maharashtra: సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడమని భర్తకు ధైర్యం నూరిపోస్తూ వీడ్కోలు పలికిన నవవధువు మాటలు అందరినీ మంత్రముగ్దులను చేస్తున్నాయి. కాళ్ల పారాణి ఆరకముందే ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Newlywed Soldier Returns To Duty: పెళ్లయి 3 రోజులు కూడా కాలేదు. దేశరక్షణ కోసం అర్జంటుగా విధుల్లో చేరాలని భారత ఆర్మీ నుంచి భర్తకు పిలుపు. ఆ నవవధువు స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఎలా స్పందించేవారో తెలీదు కానీ.. ఆమె మాత్రం ధైర్యం కోల్పోలేదు. వ్యక్తిగత జీవితం కంటే దేశ రక్షణే మిన్న అనుకుంది. సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడి విజయంతో తిరిగి రమ్మని భర్తకు ధైర్యాన్ని నూరిపోసింది. రైల్వే స్టేషన్లో కుటుంబ సభ్యులంతా బాధను గుండెల్లో నింపుకుని సాగనంపుతుంటే.. దేశసేవ కోసం నా సిందూరాన్ని పంపుతున్నా అంటున్న కొత్త పెళ్లికూతురు వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది.
పెళ్లైన 3 రోజులకే..
మహారాష్ట్ర జల్గావ్‌లోని పచోరా తాలూకాలోని పుంగావ్‌కు చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్‌కు, అదే తాలూకాలోని కలాంసర గ్రామానికి చెందిన యామినికి మే 5న వివాహమైంది. అయితే, భారత్-పాక్ మధ్య సరిహద్దుల వద్ద ఉద్రిక్తలు పెరుగుతుండటంతో వెంటనే సెలవులు రద్దు చేసుకుని విధుల్లో చేరాలని మనోజ్ కు పై అధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. దీంతో అతడు మే 8న డ్యూటీకి బయలుదేరాడు. అతడికి పచోరా రైల్వే స్టేషన్లో వీడ్కోలు పలికేందుకు భార్య, కుటుంబ సభ్యులు అక్కడకు చేరారు. ఆ సమయంలో అందరి మధ్య ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. కలల జీవితం ఆస్వాదించాలనే ఆశలను, బాధను దిగమింగుకుని.. దేశాన్ని రక్షించడానికి నా సింధూరాన్ని పంపుతున్నానంటూ భర్తకు వీడ్కోలు పలికింది యామిని. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవవధువు ధైర్యానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Read Also: India-Pak Ceasefire: సీజ్ ఫైర్ వెలువడ్డ వెంటనే కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్
Omar Abdullah: భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ.. స్వాగతించిన జమ్మూకశ్మీర్ సీఎం
India-Pakistan Ceasefire: కాదు కాదంటూనే సయోధ్య కుదిర్చిన పెద్దన్న