Share News

Producer AVM Saravanan: లెజెండరీ ప్రొడ్యూసర్ కన్నుమూత..

ABN , Publish Date - Dec 04 , 2025 | 08:20 AM

ప్రముఖ నిర్మాత ఏవీఎమ్ శరవణన్(85) కన్నుమూశారు. ఇవాళ(గురువారం) ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. శరవణన్ 300కు పైగా చిత్రాలను నిర్మించారు.

Producer AVM Saravanan: లెజెండరీ ప్రొడ్యూసర్ కన్నుమూత..
Producer AVM Saravanan

చెన్నై: ప్రముఖ సినీ నిర్మాత ఏవీఎమ్ శరవణన్(85) కన్నుమూశారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా ఇవాళ(గురువారం) ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న(బుధవారం)నే ఆయన తన పుట్టినరోజును జరుపుకున్నారు. శరవణన్ (Producer AVM Saravanan) 300కు పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగు(Telugu Films), తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో ఆయన సినిమాలు తెరకెక్కించారు. తెలుగులో సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు, జెమిని, శివాజీ, లీడర్ సహా పలు హిట్ చిత్రాలు తీశారు. కాగా, ఆయన మృతితో భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. శరవణన్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.


తమిళ సినిమా చరిత్రలో అత్యంత గొప్ప మూల స్తంభాలలో ఒకరిగా ప్రముఖ చిత్ర నిర్మాత ఏవీఎమ్ శరవణన్‌కు పేరుంది. తరతరాలుగా సినిమా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన AVM కంపెనీ ఆధ్వర్యంలో లెక్కలేనన్ని హిట్ చిత్రాలను తీయడంలో ఆయన కీలకశక్తిగా నిలిచారు. తమిళ సినిమాకు ఆయన చేసిన సేవలు అపరిమితమైనవి పలువురు సినీ రంగ ప్రముఖులు చెబుతున్నారు. ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక యుగానికి ముగింపు పలికినట్లే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శరవణన్ భౌతికకాయం ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల వరకూ ప్రజలు, బంధువులు, పరిశ్రమ స్నేహితుల సందర్శనార్థం AVM స్టూడియోస్ మూడో అంతస్తులో ఉంచనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
Pre Installed Sanchar Saathi App: సంచార్‌ సాథీపై పీఛేముడ్‌!

Haryana Wedding Tragedy: తనకన్నా ఎవ్వరూ అందంగా ఉండొద్దని..

Updated Date - Dec 04 , 2025 | 09:01 AM