Haryana Wedding Tragedy: తనకన్నా ఎవ్వరూ అందంగా ఉండొద్దని..
ABN , Publish Date - Dec 04 , 2025 | 03:58 AM
మేళతాళాల మధ్య సందడిగా ఉన్న ఆ పెళ్లి వేడుక క్షణాల్లో విషాదంగా మారింది. ఓ ఆరేళ్ల బాలిక నీటితొట్టెలో విగతజీవిగా కనిపించింది....
కుమారుడు సహా నలుగురు చిన్నారులను హత్యచేసిన మహిళ.. హరియాణాలో ఘోరం
పానిపట్, డిసెంబరు 3: మేళతాళాల మధ్య సందడిగా ఉన్న ఆ పెళ్లి వేడుక క్షణాల్లో విషాదంగా మారింది. ఓ ఆరేళ్ల బాలిక నీటితొట్టెలో విగతజీవిగా కనిపించింది. ఆ చిన్నారి ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఆమెను స్వయానా ఆమె మేనత్తే హత్యచేసిందని తెలిసి అంతా నిర్ఘాంతపోయారు. హరియాణాలోని పానిపత్‌లో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. మరింత దిగ్ర్భాంతికి గురిచేసే అంశమేమిటంటే.. ఆ చిన్నారినే కాదు గతంలో తన కుమారుడు సహా ముగ్గురు చిన్నారులను ఆమె ఇలానే హత్యచేసిందని పోలీసులు తేల్చారు. తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దనే ఉద్దేశంతోనే ఆమె ఇంతటి ఘాతుకానికి పాల్పడిందని విచారణలో తేలింది.
నిందితురాలిని పూనమ్‌గా గుర్తించారు. పెళ్లి వేడుకలో ఆమె హత్యచేసిన చిన్నారి పేరు విధి. ఈ ఏడాది ఆగస్టులో పూనమ్, సివాహ్ గ్రామంలో ఓ బాలికను చంపేసింది. 2023లో పూనమ్, మొదటి హత్య చేసింది. తనకన్నా ముద్దుగా కనిపిస్తోందనే ఉద్దేశంతో తన వదిన కుమార్తె ప్రాణాలు తీసింది. ఈ ఘటనకు సంబంధించి తననెవ్వరూ అనుమానించకుండా ఉండేందుకు తన పేగు తెంచుకొని పుట్టిన కుమారుడిని పూనమ్ చంపేసింది. గతంలో జరిగిన ఈ మూడు మరణాలు ప్రమాదవశాత్తు జరిగినవేనని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. తాజాగా బాలిక విధి హత్య మిస్టరీ తేలాకే.. గతంలో ముగ్గురిని పూనమ్ చంపినట్లు తేలింది. నలుగురు చిన్నారులనూ ఆమె ఒకే విధంగా నీటి తొట్టెలో ముంచి చంపేసింది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Renuka Chowdhury: భౌభౌ.. అన్న రేణుక
IndiGo Cancels: 1,232 ఇండిగో విమానాలు రద్దు