IndiGo Cancels: 1,232 ఇండిగో విమానాలు రద్దు
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:09 AM
దేశంలోనే అతిపెద్ద పౌరవిమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం నెలకొని దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
కొద్ది రోజులుగా సంస్థలో తీవ్ర సమస్యలు.. ఇండిగో క్షమాపణలు
న్యూఢిల్లీ, ముంబై/ శంషాబాద్ రూరల్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద పౌరవిమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం నెలకొని దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న ఇండిగో.. గత కొన్ని రోజుల్లోనే ఏకంగా 1,232 సర్వీసులను రద్దు చేసినట్లు డీజీసీఏ బుఽధవారం ప్రకటించింది. సంస్థ నిర్వహిస్తున్న మొత్తం సర్వీసుల్లో బుధవారం 35ు విమానాలే నడిపినట్లు తెలిపింది. సిబ్బంది కొరతతో 755 సర్వీసులు, ఏటీసీ సమస్యలతో 92 సర్వీసులు నిలిచిపోయినట్లు వెల్లడించింది. సర్వీసుల నిర్వహణ లో వైఫల్యంపై డీజీసీఏ ప్రధాన కార్యాలయానికి స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబైలతోపాటు పలు విమానాశ్రయాల్లో మంగళ, బుధవారాల్లో ఇండిగో సర్వీసులు రద్దు కావటంతో ప్రయాణికులు ఆ సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో, ప్రయాణికులకు క్షమాపణ చెబుతూ ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సాంకేతిక, నిర్వహణాపరమైన సమస్యలు, విమానాశ్రయాల్లో నెలకొన్న రద్దీ కారణంగా గత రెండు రోజులుగా మా సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. దీనిని నివారించటానికి చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన చోట్ల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. రీఫండ్ ఇస్తున్నాం’ అని తెలిపింది. బుధవారం శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన, ఇక్కడికి రావాల్సిన ఇండిగోకు చెందిన 40 సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్‌పోర్టులో గందరగోళం ఏర్పడింది. కేరళలోని శబరిమల ఆలయానికి వెళ్లడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చిన అయ్యప్ప స్వాములు విమానం రద్దు కావడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం షెడ్యూల్‌కు సంబంధించి మరో 18 విమాన సర్వీసులను ఇండిగో రద్దుచేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లోని చెక్‌ఇన్ వ్యవస్థల్లో బుధవారం ఉదయం అంతరాయం తలెత్తింది. పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఈ అంతరాయానికి కారణాలేమిటన్నది అధికారికంగా వెల్లడి కాకపోయినా.. మైక్రోసాఫ్ట్ విండో్‌సలో తలెత్తిన సమస్యల వల్లేనంటూ వారణాసి విమానాశ్రయంలో ప్రయాణికులకు ఒక మెసేజీని ప్రదర్శించారు. అయితే, మైక్రోసాఫ్ట్ దీన్ని ఖండించింది.