Share News

Pre Installed Sanchar Saathi App: సంచార్‌ సాథీపై పీఛేముడ్‌!

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:03 AM

స్మార్ట్‌ఫోన్లలో సంచార్‌ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ముందస్తు ఇన్‌స్టలేషన్‌ ప్రీఇన్‌స్టాల్‌ చేయాలన్న ఆదేశాలపై కేంద్రం వెనక్కి తగ్గింది....

Pre Installed Sanchar Saathi App: సంచార్‌ సాథీపై పీఛేముడ్‌!

  • ఫోన్లలో తప్పనిసరిగా ప్రీఇన్‌స్టాల్‌ చేయాలన్న ఆదేశాలు వెనక్కి తీసుకున్న కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 3: స్మార్ట్‌ఫోన్లలో ‘సంచార్‌ సాథీ’ యాప్‌ను తప్పనిసరిగా ముందస్తు ఇన్‌స్టలేషన్‌ (ప్రీఇన్‌స్టాల్‌) చేయాలన్న ఆదేశాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థలకు జారీ చేసిన ఆదేశాలను ఉప సంహరించుకుంటున్నట్టు టెలికం శాఖ (డీఓటీ) బుధవారం ప్రకటించింది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. బుధవారం సాయంత్రం టెలికం శాఖ దీనిపై ప్రకటన విడుదల చేసింది. ‘‘పెద్దగా అవగాహన లేని ప్రజలకు కూడా ఈ యాప్‌ను చేరువ చేయాలన్న ఉద్దేశంతోనే తప్పనిసరిగా ప్రీఇన్‌స్టాల్‌ చేయాలన్న ఆదేశాలు జారీ చేశాం. మంగళవారం ఒక్కరోజే 6 లక్షల మంది సంచార్‌ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇది పదింతలు ఎక్కువ. డౌన్‌లోడ్లు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కోటిన్నర మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రజల్లో మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో.. తప్పనిసరిగా ప్రీఇన్‌స్టాల్‌ చేయాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని తెలిపింది. ఇదిలా ఉండగా, పాన్‌ మసాలా ప్యాకెట్లన్నింటిపై తప్పనిసరిగా రిటైల్‌ విక్రయ ధర(ఆర్‌ఎస్పీ) ఉండాల్సిందేనని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ప్యాకేజీ పరిమాణం లేదా బరువుతో సంబంధం లేకుండా ఈ నిబంధనను అమలు చేయాలని పేర్కొంది. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. ఇంతకు ముందు 10 గ్రాములు లేదా అంతకన్నా తక్కువ బరువున్న చిన్న ప్యాక్‌లకు కొన్ని ప్రకటనల విషయంలో మినహాయింపులు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ చిన్న ప్యాక్‌లు కూడా తమ లేబుల్స్‌పై కచ్చితంగా ముద్రించాలి.

భారత్‌లో 72 వేల విదేశీ విద్యార్థులు

భారత్‌లోని ఉన్నత విద్యా సంస్థల్లో సుమారు 200 దేశాల నుంచి 72,218 మంది విదేశీ విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారని కేంద్రం బుధవారం నాడు రాజ్యసభకు తెలియజేసింది. భారతీయ విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌’ (ఐవోఈ) పథకం కింద 8 ప్రభుత్వ సంస్థలకు రూ.6.198.99 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొంది.

Updated Date - Dec 04 , 2025 | 04:03 AM