Kashmiri Pandits Ganesh Chaturthi: శ్రీనగర్‌లో కశ్మీర్ పండిట్ల రథయాత్ర.. 35 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి
ABN , Publish Date - Aug 31 , 2025 | 08:55 PM
కశ్మీర్ పండిట్లు భక్తిశ్రద్ధలతో ఎంతో ఉల్లాసంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారని, జీలం నదిలో గణేశ నిమజ్జనంతో రథయాత్ర పూర్తయిందని కార్యకర్త సంజయ్ టికూ తెలిపారు.
శ్రీనగర్: వినాయక చతుర్థి వేడుకలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా పలుచోట్ల భక్తులు అట్టహాసంగా ఊరేగింపులు నిర్వహించి చివరిగా నిమజ్జనంతో గణనాథులకు వీడ్కోలు పలుకుతున్నారు. శ్రీనగర్‌లో కశ్మీర్ పండిట్లు గణేష్ చతుర్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు రథయాత్ర నిర్వహించారు. 35 క్రితం కశ్మీర్‌లో తీవ్రవాదం మొదలైనప్పటి నుంచి కశ్మీర్ పండిట్లు రథయాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి.

శ్రీనగర్‌లోని హబ్బ కదల ఏరియాలోని గణపతియార్ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. కశ్మీర్ పండిట్లు భక్తిశ్రద్ధలతో ఎంతో ఉల్లాసంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారని, జీలం నదిలో గణేశ నిమజ్జనంతో రథయాత్ర పూర్తయిందని కార్యకర్త సంజయ్ టికూ తెలిపారు. కశ్మీర్ లోయలో తీవ్రవాదం తలెత్తినప్పటి నుంచి వినాయక చతుర్ధి ఊరేగింపు నిర్వహించడం ఇదే మొదటిసారని తెలిపారు.
'ప్రకృతి వైపరీత్యాలు ఆగిపోయి, కుల, మత భేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని గణనాథుని మేము ప్రార్థించాం. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం కలగరాదని ప్రార్థనలు చేశాం' అని టికూ తెలిపారు. గణపతి నిమజ్జనాన్ని కశ్మీర్ పండిట్లు గత మూడేళ్లుగా జరుపుకొంటున్నట్టు పండిట్ నేత ఒకరు తెలిపారు. కశ్మీర్ పండిట్లు నిర్వహించిన ఐదు రోజుల గణేష్ చతుర్ధి ఉత్సవాలు ఆదివారంతో ముగిసాయి.
ఇవి కూడా చదవండి..
నేరుగా విమానాలు నుంచి వాణిజ్యం వరకూ.. బలపడుతున్న భారత్-చైనా బంధం
బిహార్‌లో మళ్లీ ఎస్ఐఆర్.. కాంగ్రెస్ కొత్త పల్లవి
For More National News And Telugu News