Congress Demands SIR Again: బిహార్‌లో మళ్లీ ఎస్ఐఆర్.. కాంగ్రెస్ కొత్త పల్లవి
ABN , Publish Date - Aug 31 , 2025 | 07:19 PM
బిహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే 'ఇండియా' కూటమిలోని పలు పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. జాబితాలో పేర్లు లేకుండా చేయడం, సరైన నోటీసులు ఇవ్వకపోవడం ద్వారా లక్షలాది మందికి ఓటు హక్కు లేకుండా చేశారని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: బిహార్‌లో చేపట్టిన ఎన్నికల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ (SIR)లో అవకతవకలపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా తన విమర్శలను మరింత తీవ్రం చేసింది. ఎస్ఐఆర్‌ను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేసింది. పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా ఆదివారంనాడు పాట్నాలో మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, బూత్ లెవెల్ ఏజెంట్లకు సమర్పించిన 89 లక్షల ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని ఆరోపించారు.
'ఎస్ఐఆర్ తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతో ఈసీ ఉద్దేశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి' అని పవన్ ఖేరా ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీ నుంచి ఫిర్యాదులు రాలేదని ఈసీ తప్పుడు కథనాలు అల్లుతోందని, ఎస్ఐఆర్‌లో అవకతవకలకు సంబంధించి 89 లక్షల ఫిర్యాదులను ఈసీకి కాంగ్రెస్ సమర్పించిందని తెలిపారు. రాజకీయ పార్టీలు కాకుండా వ్యక్తిగతంగానే ఫిర్యాదులు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఈసీ చెబుతోందని అన్నారు.
బిహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే 'ఇండియా' కూటమిలోని పలు పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. జాబితాలో పేర్లు లేకుండా చేయడం, సరైన నోటీసులు ఇవ్వకపోవడం ద్వారా లక్షలాది మందికి ఓటు హక్కు లేకుండా చేశారని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 'ఓటర్ అధికార్ యాత్ర'ను బీహార్‌లో ఈగస్టు 17న ప్రారంభించారు. ఇండియా కూటమి పార్టీలు దన్నుగా నిలుస్తున్న ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది. కాగా, ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను మినహాయించాలంటూ 1.98 లక్షల మంది తమకు విజ్ఞాపనలు అందజేసినట్టు ఎన్నికల కమిషన్ శనివారంనాడు తెలిపింది. ఓటర్ల జాబితాలో తమ పేర్లు చేర్చాలని 30,000 విజ్ఞాపనలు వచ్చాయని ప్రకటించింది. ముసాయిదా ఎన్నికల జాబితాను ఆగస్టు 1న ఎన్నికల కమిషన్ విడుదల చేయగా, వ్యక్తులు, రాజకీయ పార్టీలు తమ వాదనలు, అభ్యంతరాలను తెలియజేసేందుకు సెప్టెంబర్ 1వ తేదీ వరకూ గడువు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం
అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్
For More National News And Telugu News