Share News

Karreguttalu Encounter: కర్రెగుట్టలపై భీకర కాల్పులు.. మావోలకు గట్టి షాక్

ABN , Publish Date - May 07 , 2025 | 09:58 AM

Karreguttalu Encounter: మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కర్రెగుట్టలపై జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు.

Karreguttalu Encounter: కర్రెగుట్టలపై భీకర కాల్పులు.. మావోలకు గట్టి షాక్
Karreguttalu Encounter

ఛత్తీస్‌గఢ్, మే 7: మావోయిస్టులకు (Maoists) మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్‌ కర్రెగుట్టలు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈరోజు (బుధవారం) ఉదయం తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలపై (Operation Karreguttalu) భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.


కాగా.. నిన్న కూడా కర్రెగుట్టలపై ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. 303-రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు మహిళా నక్సలైట్లు చనిపోయారని, వందల సంఖ్యలో మావోయిస్టుల స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేశామని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలను జల్లెడపడుతున్నాయి. బీఎస్‌ఎఫ్, ఎస్‌టీఎఫ్, డీఆర్‌జీ బలగాలు ఆ ప్రాంతాన్ని సెర్చ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడటంతో వెంటనే శిబిరానికి తీసుకొచ్చి ప్రథమ చికిత్స అనంతరం హెలికాఫ్టర్‌లో బీజాపూర్ ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు కూడా ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆపరేషన్‌ కర్రెగుట్టల్లో దాదాపు 200 ఐఈడీలను భద్రతా బలగాలు నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే.


మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అంతా వార్‌జోన్‌గా మారింది. దాదాపు 15 రోజులుగా కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. ఇప్పటికే వందలాది మావోయిస్టుల రహస్య స్థావరాలు, బంకర్‌లను గుర్తించారు. మావోయిస్టుల స్థావరాల నుంచి వేల కిలోల పేలుడు పదార్థాలు, నిత్యావసర వస్తువులు, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం సెర్చ్ కొనసాగుతూనే ఉంది.


ఇవి కూడా చదవండి

Operation sindoor: భారత్ మెరుపు దాడులపై స్పందించిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

Operation Sindoor: పాక్‌‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు

Read Latest National News And Telugu News

Updated Date - May 07 , 2025 | 10:18 AM