Share News

Kamal Hasan: అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాల్లో ఎంఎన్‌ఎం పోటీ..

ABN , Publish Date - Sep 26 , 2025 | 10:51 AM

డీఎంకే కూటమిలోని ‘మక్కల్‌ నీదిమయ్యం’ (ఎంఎన్‌ఎం) ఈ సారి ఆచితూచి అడుగులేయాలని నిర్ణయించుకుంది. ‘ఇండియా’ కూటమిలో వున్న ఆ పార్టీ.. ఇప్పటికే తమకు మెరుగైన అవకాశాలున్న నియోజకవర్గాలను గుర్తించడంతో పాటు ఆ స్థానాలను డీఎంకే తమకు కేటాయించేలా ఒత్తిడి పెంచాలని భావిస్తోంది.

Kamal Hasan: అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాల్లో ఎంఎన్‌ఎం పోటీ..

- పార్టీ సమావేశంలో నేతల సూచన

చెన్నై: డీఎంకే కూటమిలోని ‘మక్కల్‌ నీదిమయ్యం’ (ఎంఎన్‌ఎం) ఈ సారి ఆచితూచి అడుగులేయాలని నిర్ణయించుకుంది. ‘ఇండియా’ కూటమిలో వున్న ఆ పార్టీ.. ఇప్పటికే తమకు మెరుగైన అవకాశాలున్న నియోజకవర్గాలను గుర్తించడంతో పాటు ఆ స్థానాలను డీఎంకే తమకు కేటాయించేలా ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం అన్ని పార్టీలూ అసెంబ్లీ ఎన్నికల వైపే దృష్టిసారిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహరచనలు రూపొందించుకుంటున్నాయి. ఆ కోవలోనే ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌(Kamal Hasan) నేతృత్వంలోని ఎంఎన్‌ఎం గత నాలుగు రోజులుగా పార్టీ నాయకుల సమావేశాలు జరిపి అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపింది.


2018లో పార్టీని ప్రారంభించిన కమల్‌ మరుసటి సంవత్సరమే జరిగిన లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. పార్టీకంటూ ప్రత్యేక ఓటు బ్యాంక్‌ సంపాదించుకున్నారు. 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసింది. పలువురు అభ్యర్థులు ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చి అత్యధికంగా ఓట్లు సంపాదించుకున్నారు. కోవైలో పోటీ చేసిన కమల్‌.. స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 శాతం ఓట్లు, ఎనిమిది నియోజకవర్గాలలో 10 శాతం ఓట్లు పొందారు. అదే విధంగా 71 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు 5 వేలకు పైగా ఓట్లు సాధించారు.


nani1.2.jpg

ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతు పలికారు. అయితే ముందస్తు ఒడంబడిక మేరకు డీఎంకే పార్టీ కమల్‌ రాజ్యసభ స్థానం ఇచ్చింది. ప్రస్తుతం జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ గురించి వారి అభిప్రాయాలను కమల్‌ తెలుసుకున్నారు. పార్టీ నిర్వాహకులందరూ అసెంబ్లీ ఎన్నికల్లో 10కి పైగా సీట్లలో పోటీ చేయాలని, ఆ దిశగా డీఎంకే కూటమి నుండి సీట్లు పొందాలని సూచించారు. చివరగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులు ఆశించినంత సీట్లు పొందటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..

కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Sep 26 , 2025 | 10:51 AM