Kalyan Banerjee: టీఎంసీ లోక్‌సభ చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ గుడ్‌బై
ABN , Publish Date - Aug 04 , 2025 | 09:24 PM
కల్యాణ్ బెనర్జీ, కృష్ణానగర్ ఎంపీ మహువా మొయిత్రా మధ్య కొద్దికాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీనికి ముందు టీఎంసీ ఎంపీ కీర్తి అజాద్‌తోనూ మహువా మొయిత్రా గొడవపడ్డారు.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ పదవికి సోమవారంనాడు రాజీనామా చేశారు. పార్టీ ఎంపీల మధ్య సమన్వయం లోపించిందనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. అయితే పార్లమెంటు సమావేశాలకు కొంత మంది సభ్యులు అరుదుగా హాజరవుతున్నారంటూ పలుమార్లు ఆయన వాపోయిన సందర్భాలు ఉన్నాయి. టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటేరియన్లతో వర్చువల్ సమావేశం జరిగిన కొద్ది గంటలకే కల్యాణ్ బెనర్జీ రాజీనామా చోటుచేసుకుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో పార్టీ పార్లమెటంటరీ టీమ్‌లో సమన్వయం లోపించడం పట్ల మమతాబెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
దీనిపై కల్యామ్ బెనర్జీ మాట్లాడుతూ, పార్టీ ఎంపీల మధ్య సమన్వయం కొరవడిందని వర్చువల్ మీటింగ్‌లో దీదీ (మమతా బెనర్జీ) చెప్పడంతో చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అసలు బాధ్యులైన వారిపై క్రమశిక్షణా చర్య తీసుకోకుండా తనను తప్పుబట్టడం చిన్నబుచ్చడమే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కల్యాణ్ బెనర్జీ, కృష్ణానగర్ ఎంపీ మహువా మొయిత్రా మధ్య కొద్దికాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీనికి ముందు టీఎంసీ ఎంపీ కీర్తి అజాద్‌తోనూ మహువా మొయిత్రా గొడవపడ్డారు. ఈ క్రమంలో పార్టీ చీఫ్ విప్ పదవికి రాజీనామా చేసిన కల్యాణ్ బెనర్జీ పరోక్షంగా మహువాను తప్పుపట్టారు. తన సహచర ఎంపీ తనను అవమానిస్తుంటే పార్టీ మౌనంగా ఉండిపోవడం తనను తీవ్రంగా బాధించినట్టు చెప్పారు. తాను రాజీనామా చేసినందున అధినేత్రికి ఏది ఆమోదయోగ్యంపై అనిపిస్తే ఆ విధంగా పార్టీని నడిపించుకోవచ్చని అన్నారు.
ఇవి కూడా చదవండి..
జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్.. నిజం చేసి చూపించిన జంట
రాష్ట్రపతితో మోదీ, అమిత్‌షా సమావేశం వెనుక కారణం ఇదేనట
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి