Bihar Elections 2025: జన్ సురాజ్ రెండో లిస్ట్.. ఈసారి కూడా ప్రశాంత్ కిశోర్ పేరు లేదు
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:33 PM
ఎన్నికల్లో పోటీచేసే 116 మంది అభ్యర్థులను ఇంతవరకూ ప్రకటించామని, త్వరలోనే తక్కిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల రెండో విడత జాబితాను 'జన్ సురాజ్' (Jan Surraj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) సోమవారంనాడు విడుదల చేశారు. 65 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో ఈసారి కూడా ఆయన పేరు చోటుచేసుకోలేదు. రఘోపూర్ (Raghopur) నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు పోటీగా ప్రశాంత్ కిశోర్ నిలబడతారనే ప్రచారం జరుగుతోంది.
ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు కంచుకోటగా పేరున్న హర్నాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కమలేశ్ పాశ్వాన్‌ను జన సురాజ్ పార్టీ బరిలోకి దింపింది. రెండో విడత జాబితాలో 20 రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు (10 ఎస్సీ, ఒక ఎస్టీ), 46 అన్ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఎన్నికల్లో పోటీచేసే 116 మంది అభ్యర్థులను ఇంతవరకూ ప్రకటించామని, త్వరలోనే తక్కిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రకటించిన అభ్యర్థుల్లో 31 మంది బాగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, 21 మంది ఇతర వెనుకబడిన తరగతుల వారు, 21 మంది ముస్లింలు ఉన్నారని తెలిపారు. దీనికి ముందు అక్టోబర్ 9న 51 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రశాంత్ కిశోర్ విడుదల చేశారు. వీరిలో కేద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ కుమార్ లతా సింగ్, లెజెండ్రీ సోషలిస్ట్ నేత కర్పూరీ ఠాకూర్ మనుమరాలు జాగృతి ఠాకూర్, ప్రముఖ బోజ్‌పురి గాయకురాలు రితీష్ పాండే, ప్రముఖ గణితశాస్త్రవేత్త కేసీ సిన్హా ఉన్నారు.
త్రిముఖ పోటీ
ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఎన్డీయే, 'ఇండియా' కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చెబుతున్నప్పటికీ 'జన్ సురాజ్' పార్టీ సైతం ఎన్నికల ఫలితాలపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 74 సీట్లతో ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఈసారి ప్రశాంత్ కిశోర్ జన్‌సురాజ్ తోడవడంతో పోటీ గట్టిగా ఉండొచ్చని, ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలు, కొత్త నేతల ప్రభావం గణనీయంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీయేకు అసెంబ్లీలో 131 సీట్ల బలం (బీజేపీ-80, జేడీయూ 45, హెచ్ఏఎం-4, ఇద్దరు ఇండిపెండెంట్లు) ఉండగా, విపక్ష మహాకూటమికి 111 సీట్ల బలం (ఆర్జేడీ-77, కాంగ్రెస్-19, సీపీఐఎంఎల్-11, సీపీఎం-2 సీపీఐ-2) ఉంది.
ఇవి కూడా చదవండి..
తాజ్ మహల్ కాంప్లెక్స్ వద్ద అగ్నిప్రమాదం
రాహుల్ ఓటు చోరీ వ్యాఖ్యలపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి