Prashant Kishor: మూడేళ్లలో రూ.241 కోట్లు సంపాదించా.. జన్ సురాజ్ నిధులపై పీకే
ABN , Publish Date - Sep 29 , 2025 | 05:51 PM
పార్టీ అకౌంట్స్‌కు చెందిన పేమెంట్లన్నీ చెక్కుల్లోనే ఉంటాయని, తప్పులకు అవకాశమే లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇతర మార్గాల ద్వారా కూడా తమ పార్టీకి డొనేషన్లు వచ్చాయని తెలిపారు.
పాట్నా: 'జన్ సురాజ్' (Jan Suraaj) పార్టీ నిధులన్నీ పూర్తిగా పారదర్శకమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) తెలిపారు. డబ్బులు సంపాదన కోసం తాను ఇక్కడకు రాలేదని, బిహార్‌లో మార్పు తేవడమే తన లక్ష్యమని చెప్పారు. జన్ సురాజ్ నిధులపై బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ ఇటీవల ప్రశ్నించిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తాజా వ్యాఖ్యలు చేశారు.
'జన్ సురాజ్ నిధులన్నీ పూర్తిగా పారదర్శకం. నేను కన్సల్టెంట్‌గా పనిచేశా. చేసిన పనికి ఫీజు తీసుకున్నా. మూడేళ్లలో రూ.241 కోట్లు సంపాదించా. రూ.31 కోట్ల మేరకు జీఎస్టీ, రూ.20 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాం. చెక్ పేమెంట్ల ద్వారా రూ.98 కోట్లు జన్ సురాజ్‌కు డొనేట్ చేశాను' అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. పార్టీ అకౌంట్స్‌కు చెందిన పేమెంట్లన్నీ చెక్కుల్లోనే ఉంటాయని, తప్పిదాలకు అవకాశమే లేదని చెప్పారు. ఇతర మార్గాల ద్వారా కూడా తమ పార్టీకి డొనేషన్లు వచ్చాయని తెలిపారు. డబ్బులు సంపాదించడానికి తాను బిహార్ రాలేదని, ప్రతి రూపాయికి జవాబుదారీ ఉందని చెప్పారు. మరో పదేళ్లు వరకూ తాను ఇక్కడే ఉంటానని చెప్పారు. వ్యవస్థలో మార్పు రానంత వరకూ తాను ఇక్కడే కొనసాగుతానని తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న బిహర్ అసెంబ్లీ ఎన్నికల్లో 'జన్ సురాజ్' పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. తమ పార్టీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని, గణనీయంగా ఓటు బ్యాంకు సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ ఎంపీ ఏమన్నారు?
బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ ఇటీవల జన్ సురాజ్ నిధులపై ప్రశ్నలు గుప్పించారు. షెల్ కంపెనీల ద్వారా ఆ పార్టీ కోట్లు సేకరిస్తోందని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న కంపెనీలు కోట్ల రూపాయిలు ప్రశాంత్ కిషోర్‌కే ఎందుకు ఇస్తున్నాయని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
అన్ని వైపులా లోపం ఉంది.. కరూర్ తొక్కిసలాటపై చిదంబరం
For More National News And Telugu News