Share News

Wangchuk: క్రికెట్‌కు తప్పు లేదు కానీ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటే నేరమా.. వాంగ్‌చుక్ విడుదలను కోరిన లద్దాఖ్ కార్యకర్తలు

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:51 PM

లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌లో గతవారంలో లెహ్‌లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వాంగ్‌చుక్ తన ప్రసంగాలతో హింసను రెచ్చగొట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆయన జోథ్‌పూర్ జైలులో ఉన్నారు.

Wangchuk: క్రికెట్‌కు తప్పు లేదు కానీ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటే నేరమా.. వాంగ్‌చుక్ విడుదలను కోరిన లద్దాఖ్ కార్యకర్తలు
Sonam Wangchuk

న్యూఢిల్లీ: లెహ్‌ (Leh) హింసాకాండ అనంతరం అరెస్టు చేసిన పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ (Sonam Wangchuk)ను వెంటనే విడుదల చేయాలని కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్ (KDA) డిమాండ్ చేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో పాల్గొన్నారనే కారణంగా వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధాలు ఎలా అంటకడతారని కూటమి నేతలు ప్రశ్నించారు. ఇరుగుపొరుగు దేశాల ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ ఆడుతున్నప్పుడు వాంగ్‌చుక్ పర్యటనను ఎందుకు రాజకీయం చేస్తున్నారని నిలదీశారు. లద్దాఖ్‌కు చెందిన పలువురు కార్యకర్తలు న్యూఢిల్లీలో సోమవారంనాడు మీడియాతో మాట్లాడారు. జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడంపై నిరసన తెలిపారు.


లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌లో గతవారంలో లెహ్‌లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వాంగ్‌చుక్ తన ప్రసంగాలతో హింసను రెచ్చగొట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆయన జోథ్‌పూర్ జైలులో ఉన్నారు.


న్యాయవిచారణకు డిమాండ్

కాగా, వాంగ్‌చుక్ అరెస్టును కేడీఏకు చెందిన సజ్దాద్ కార్గిలి ఖండించారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సదస్సుకు వాంగ్‌చుక్ హాజరయ్యారని, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడటం నేరం కానప్పుడు, అక్కడి కాన్ఫరెన్స్‌కు వాంగ్‌చుక్ హాజరుకావడాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సెప్టెంబర్ 24న జరిగిన హింసాకాండపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రక్తం ధారపోసి మరీ సరిహద్దులను తాము కాపాడుకుంటున్నామని, అలాంటి తమపై చర్యలు తీసుకోవడం సబబు కాదని అన్నారు. అల్లర్ల మృతులలో ఒక సైనికుడు కూడా ఉన్నారని, ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవాలని అన్నారు. నిరసనకారులపై కాల్పులకు ఆదేశించడం నేరమవుతుందని కార్గిలి అన్నారు.


లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడం, దానిని రాజ్యాంగంలో చేర్చడం, యువకుల గెజిటెడ్ జాబ్‌లు ఇవ్వడం, లెహ్, కార్గిల్‌కు సెపరేట్ లోక్‌సభ సీట్లు కల్పించడం తమ డిమాండ్లుగా ఉన్నయని చెప్పారు. ఇంతవరకూ ప్రభుత్వంతో జరిగిన సమావేశాలన్నీ నిరసనల తర్వాత మాత్రమే జరిగాయని అన్నారు. 'మేము సైలెంట్‌గా ఉన్నప్పుడల్లా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ఏడాది కూడా 11 రోజుల నిరసన తరువాతే ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిపించి' అని కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్ నేతలు తెలిపారు.


హోం మంత్రిత్వ శాఖను కలవనున్న నేతలు

లద్దాఖ్ నేతలు హోం మంత్రిత్వ శాఖ అధికారులతో మంగళవారంనాడు సమావేశం కానున్నారు. షెడ్యూల్ ప్రకారం అత్యున్నత స్థాయి సమావేశం అక్టోబర్ 6న జరుగనుంది. ప్రభుత్వంతో తాము చాలాకాలంగా చర్చలు జరుపుతున్నప్పటికీ ఒరిగిందేమీ లేదని, లద్దాఖ్ ప్రజలు ఇప్పటికే పరాధీన బతుకులు గడుపుతున్నామనే భావనలో ఉన్నందున ప్రభుత్వం సమస్య సున్నితత్వాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని లద్దాఖ్ నేతలు కోరారు.


ఇవి కూడా చదవండి..

మహారాష్ట్రలో మత ఘర్షణలు.. లాఠీచార్జి, 30 మంది అరెస్టు

విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు

For More National News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 03:54 PM