Sharjeel Imam: ఎన్నికల్లో పోటీకి తాత్కాలిక బెయిల్ కోరిన షర్జీల్ ఇమామ్
ABN , Publish Date - Oct 13 , 2025 | 08:49 PM
ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నందున అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 29 వరకూ 14 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని షర్జీల్ ఇమామ్ కోరారు. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు, ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక బెయిల్ అనివార్యమని అన్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసు (Delhi riots case)లో నిందితునిగా ఉన్న షర్జీల్ ఇమామ్ (Sharjeel Imam) తాత్కాలిక బెయిలు కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహదూర్‌గంజ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నందున తనకు తాత్కాలిక బెయిల్ ముంజూరు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఈమేరకు అడిషనల్ సెక్షన్ జడ్జి సమీర్ బాజ్‌పేయి ముందు షర్జీల్ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నందున అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 29 వరకూ 14 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని షర్జీల్ ఇమామ్ కోరారు. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు, ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక బెయిల్ అనివార్యమని అన్నారు. ఐదేళ్లుగా తాను జైలులో ఉంటున్నానని, కనీసం తాత్కాలికంగానైనా తనకు బెయిల్ మంజూరు చేయలేదని ఆ పిటిషన్‌లో షర్జీల్ పేర్కొన్నారు. పొలిటికల్ ప్రిజనర్‌గా, స్టూటెంట్ యాక్టివిస్టుగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రాథమిక హక్కు తనకు ఉందన్నారు. అస్వస్థతగా ఉన్న తన తల్లిని చిన్నతమ్ముడే చూసుకుంటున్నాడని, అతనే తన నామిషన్‌కు, ప్రచారానికి కూడా సపోర్ట్‌గా ఉంటాడని కూడా షర్జీల్ తెలిపారు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, షర్జీల్ పిటిషన్‌పై కోర్టు మంగళవారంనాడు విచారణ జరిపే అవకాశం ఉంది.
ఈశాన్య ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో సీఏఏ వ్యతిరేక నిరసలు హింసాత్మకంగా మారిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో సుమారు 53 మంది దుర్మరణం పాలయ్యారు. 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ యూఏపీఏ కింద ఛార్జిషీటు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
జన్ సురాజ్ రెండో లిస్ట్.. ఈసారి కూడా ప్రశాంత్ కిశోర్ పేరు లేదు
రాహుల్ ఓటు చోరీ వ్యాఖ్యలపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి