Share News

India accidents: ఒక్క వారంలో 50 మంది మృత్యువాత.. దేశవ్యాప్తంగా జరిగిన ఘోర విషాదాలు..

ABN , Publish Date - Nov 05 , 2025 | 06:09 PM

గత వారం భారతదేశం అనేక పెద్ద ప్రమాదాలను, ఘోర విషాదాలను చవిచూసింది. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నాయి.

India accidents: ఒక్క వారంలో 50 మంది మృత్యువాత.. దేశవ్యాప్తంగా జరిగిన ఘోర విషాదాలు..
India accidents

గత వారం భారతదేశం అనేక పెద్ద ప్రమాదాలను, ఘోర విషాదాలను చవిచూసింది. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నాయి. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, దేవాలయాల్లో తొక్కిసలాటలు ఈ ప్రమాదాలకు కారణాలుగా నిలిచాయి (Indias Deadly Week).


1)కాశీబుగ్గ ఘటన (Temple stampede):

నవంబర్ 1వ తేదీన కార్తీక మాస ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఏకాదశికి తోడు శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆ రోజు ఆలయానికి రెండు వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తే, ఏకంగా 15 వేల మంది వచ్చారు. ఆ తొక్కిసలాటలో 9 మంది మరణించగా, 25 మంది భక్తులకు పైగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో అక్టోబర్ 24న జరిగిన స్లీపర్ బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు.

2)తెలంగాణ బస్సు ప్రమాదం (Telangana Bus Accident):

నవంబర్ 3వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశం మొత్తాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర గాయాల పాలై హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.


3)బిలాస్‌పూర్ రైలు ప్రమాదం (Bilaspur Train Accident):

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ సమీపంలో మంగళవారం (నవంబర్ 4) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగింది. గెవ్రా రోడ్‌ నుంచి బిలాస్ పూర్ వైపు వస్తున్న లోకల్ రైలు, గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

4)మిర్జాపూర్ రైలు ప్రమాదం (Mirzapur Train Accident):

ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ చునార్ జంక్షన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం (నవంబర్ 5) నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

5)జైపూర్ ప్రమాదం (Jaipur Truck Accident):

సోమవారం (నవంబర్ 3) రాజస్థాన్‌లోని జైపూర్‌‌లో ఒక అదుపుతప్పిన టిప్పర్ 30-40 వాహనాలను బలంగా ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ఈ భారీ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా.


ఇవి కూడా చదవండి..

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..

ఎస్ఐఆర్‌ను మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా.. రాహుల్ ఆరోపణలపై ఈసీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2025 | 07:35 PM