Share News

India Global Message: విదేశాలకు అఖిలపక్ష బృందాలు.. కారణమిదే

ABN , Publish Date - May 17 , 2025 | 10:51 AM

India Global Message: విదేశాలకు అఖిలపక్ష ఎంపీల బృందాలు వెళ్లనున్నాయి. ఉగ్రవాదంపై భారతదేశం జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తోందన్న సందేశాన్ని ప్రపంచానికి ఎంపీల బృందం వెల్లడించనుంది.

India Global Message: విదేశాలకు అఖిలపక్ష బృందాలు.. కారణమిదే
India Global Message On Terrorism

న్యూఢిల్లీ, మే 17: పాకిస్థాన్ విషయంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాక్ దుష్ట బుద్ధిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంటోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను దెబ్బ తీసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక రకాలుగా పాక్‌ను దెబ్బ తీసిన భారత్.. ఇప్పుడు దౌత్యపరంగానూ చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. పాక్ దుశ్చర్యలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పాక్‌పై దాడిలో మహిళా సైనికులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన భారత ప్రభుత్వం.. ఇప్పుడు ఈ కమిటీలోనూ మహిళలకే ప్రాధాన్యతనిచ్చింది. ఇంతకీ ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు.. ఈ కమిటీ సభ్యులు ఏం చేయనున్నారు.. వివరాలు తెలుసుకుందాం..


ఉగ్రవాదం పట్ల భారతదేశం (India) జీరో టాలరెన్స్ విధానం పాటిస్తోందన్న బలమైన సందేశాన్ని ప్రపంచానికి వెల్లడించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన బృందాలు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యాయి. ఈ నెల 22, 23 తేదీల్లో ఏడు బృందాలు విదేశాలకు వెళ్లనున్నాయి. ఈనెల 22 నుంచి జూన్ 1 వరకు కూడా అమెరికా, యూరోపియన్, జపాన్, యూఏఈ, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూకే, దక్షిణాసియా దేశాలను ఈ బృందాలు సందర్శించనున్నాయి. ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం కొనసాగిస్తున్న పోరాటం నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో కూడిన ప్రతినిధుల బృందాలు విదేశాల్లో పర్యటించనున్నాయి. ముఖ్య భాగస్వామ్య దేశాలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలను ఈ బృందాలు సందర్శిస్తాయి.


ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందన్న బలమైన సందేశాన్ని ఈ బృందాలు ప్రపంచానికి చాటి చెప్పనున్నాయి. విభిన్న రాజకీయ పార్టీల పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకులు , ప్రతిష్టాత్మక దౌత్యవేత్తలు ఈ ప్రతినిధి బృందాల్లో భాగంగా ఉండనున్నారు. శశి థరూర్ (ఐఎన్‌సీ), రవి శంకర్ ప్రసాద్(బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), బైజయంత్ పాండా (బీజేపీ), కనిమొళి కరుణానిధి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్‌సీపీ),శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే (శివసేన) ఈ ఏడుగురు నేతృత్వంలో పార్లమెంటు బృందాలు విదేశాలకు వెళ్తున్నాయి.


ఏయే దేశాలకు ఎవరెవరు వెళ్లనున్నారంటే...

  • అమెరికాకు శశిథరూర్ నేతృత్వంలోని బృందం

  • మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం

  • ఆగ్నేయాసియాకు సంజయ్ కుమార్ ఝా బృందం

  • తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం

  • రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం

  • పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం

  • ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే బృందం


ఇవి కూడా చదవండి

Pilotless Drones: గాలమేసి.. గురిచూసి..

Bengaluru Techie: చిన్న వయసులోనే కోటి సంపాదన.. సీక్రెట్ చెప్పిన టెకీ..

Read Latest National News And Telugu News

Updated Date - May 17 , 2025 | 03:14 PM