Share News

India on H-1b Visa Hike: అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో వీసాదారుల కుటుంబాలపై ప్రభావం: భారత్

ABN , Publish Date - Sep 20 , 2025 | 08:51 PM

హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. అభివృద్ధిలో ఇరు దేశాల భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో కలిసి చర్చించుకుని ముందడుగు వేయాలంటూ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

India on H-1b Visa Hike: అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో వీసాదారుల కుటుంబాలపై ప్రభావం: భారత్
India on H1b Fee Hike, Humanitarian Impact

ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా ఫీజును అమెరికా ప్రభుత్వం భారీగా పెంచడంపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. ఈ నిర్ణయం హెచ్-1బీ వీసాదారుల కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫీజు పెంపు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కూడా కోరినట్టు వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది (India on Humanitarian Impact H1b fee).

నిపుణులైన సిబ్బంది వల్ల భారత్, అమెరికాలో టెక్నాలజీ అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, పోటీతత్వం, సృజనాత్మకత పెరుగుదల, సంపద సృష్టి జరిగిందని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ అంశాల దృష్ట్యా విధానకర్తలు ఇరు దేశాల ప్రయోజనాలు, అమెరికా- భారత దేశ ప్రజల మధ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని తమ చర్యలను పరిశీలించాలని సూచించింది (MEA Statement on H-1b Visa Fee Hike).


హెచ్-1బీ వీసా ఫీజు పెంపు ప్రభావాన్ని ఈ రంగంతో ముడిపడిన వారందరూ పరిశీలిస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటికే తమ ప్రాథమిక విశ్లేషణను వెల్లడించాయని తెలిపింది. ఇరు దేశాల్లోని ఐటీ పరిశ్రమలకు అభివృద్ధిలో పాత్ర ఉందని, ఈ విషయంలో ముందుకు సాగేందుకు చర్చలు జరుగుతాయని తెలిపింది (Innovation ties India US).

హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై నాస్కామ్ ఇప్పటికే హెచ్చరించింది. అమెరికా సృజనాత్మకతోపాటు ఉపాధికల్పనపైనా ఈ చర్య ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇప్పటికే భారతీయ సంస్థలు స్థానికంగా నియామకాలు చేపడుతున్న విషయాన్ని పేర్కొంది. అయితే, ఇలా అకస్మాత్తుగా విధాన మార్పులతో వ్యాపారాలు, వృత్తి నిపుణులకు అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటారని హెచ్చరించింది. హెచ్-1బీ వ్యవస్థ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు వీసా ఫీజులు పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ట్రంప్ హెచ్-1బీ వీసా ప్రకటన.. అమాంతం పెరిగిన భారత్-అమెరికా విమాన టిక్కెట్ల ధరలు

దసరా సందర్భంగా శూర్పణఖ దహనం.. పురుష హక్కుల సంఘం సంచలన ప్రకటన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 20 , 2025 | 09:33 PM