Indore Surpanakha Dahan: దసరా సందర్భంగా శూర్పణఖ దహనం.. పురుష హక్కుల సంఘం సంచలన ప్రకటన
ABN , Publish Date - Sep 20 , 2025 | 03:45 PM
ఇండోర్‌కు చెందిన పురుష హక్కుల పోరాట సంస్థ తాజాగా సంచలన ప్రకటన చేసింది. దసరా సందర్భంగా రావణ దహనానికి బదులు శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించింది. భర్తలను అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్న 10 మంది మహిళల ఫొటోలతో ఉన్న దిష్టిబొమ్మను దహనం చేస్తామని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: దసరా పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రావణ దహనాలు నిర్వహిస్తారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ పురుష హక్కుల సంస్థ ఈసారి శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. భర్తలను పొట్టనపెట్టుకున్న భార్యల తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం ఏర్పాటుకు నిశ్చయించినట్టు పౌరుష్ అనే సంస్థ ప్రకటించింది. ఇటీవల హనీమూన్‌లో భర్తను హత్య చేసిన యువతి సోనమ్ రఘువంశీ, భర్తను చంపి డ్రమ్ములో పాతిపెట్టిన మీరట్ యువతి ముస్కాన్‌తో పాటు పలు మహిళా నిందితుల ఫొటోలను దిష్టిబొమ్మపై పెట్టి దహనం చేస్తామని సంస్థ అధ్యక్షుడు అశోక్ దశోరా పేర్కొన్నారు (Surpanakha Dahan in Indore).
‘దిష్మి బొమ్మ మధ్యలో సోనమ్ సూర్యవంశీ ఫొటో పెడతాం. ఆమె ఇండోర్‌కు చెడ్డ పేరు తెచ్చింది. ఆమెతోపాటు భర్తను పొట్టన పెట్టుకున్న ముస్కాన్, నికితా సింఘానియా వంటి మొత్తం 10 మంది మహిళల ఫొటోలు బొమ్మపై ఏర్పాటు చేస్తాం. ఈ సిగ్గుమాలిన చర్యలకు సంకేతాత్మక నిరసనగా దిష్టి బొమ్మ దహనానికి ప్లాన్ చేశాం’ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా వారు విడుదల చేశారు (Sonam Raghuvanshi effigy).
జ్వాలా అనే ఎన్జీఓ అధ్యక్షురాలు దివ్య గుప్తా ఈ దిష్టి బొమ్మ దహనంపై మండిపడ్డారు. ‘ఆ పోస్టర్‌ను చూశాక నాకు చాలా ఆగ్రహం కలిగింది. రోత పుట్టించేలా ఉంది. ఓ 10-11 మంది మహిళల పోస్టర్‌తో నిరసన పేరిట ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే అది కచ్చితంగా నేరమే. మహిళలందరికీ ఈ పది మంది నిందితులు ఏమైనా ప్రతినిధులా? మరి ప్రతి రోజూ భర్త, ఇతర కుటుంబసభ్యుల చేతుల్లో వేధింపులకు గురవుతున్న మహిళల పరిస్థితి ఏమిటి? అసలు ఇలాంటి ఆలోచనా ధోరణులకు సమాజంలో స్థానం ఉండకూడదు. అసలు ఇలాంటి నిరసన చేపట్టేందుకు వారు ముందస్తుగా ఏమైనా పర్మిషన్లు తీసుకున్నారేమో అధికారులు చెప్పాలి. లేకపోతే వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దు’ అని దివ్య గుప్తా అన్నారు.
ఇవి కూడా చదవండి:
మోదీ బలహీన ప్రధాని.. హెచ్-1బి వీసాలపై యూఎస్ నిర్ణయంపై రాహుల్ విమర్శ
విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం