Share News

PM Narendra Modi: భారత సంతతి ప్రజలకు ఓసీఐ కార్డులు

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:06 AM

ట్రినిడాడ్‌, టుబాగో దేశంలో నివసిస్తున్న భారత సంతతి ప్రజల్లో ఆరో తరం వారికి కూడా ప్రవాస భారతీయ పౌరసత్వ ఓసీఐ కార్డులు ఇవ్వనున్నట్లు ఆ దేశ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.

PM Narendra Modi: భారత సంతతి ప్రజలకు ఓసీఐ కార్డులు

  • ఆరో తరం వరకు ఉదారంగా ఇస్తాం

  • ట్రినిడాడ్‌, టుబాగో పర్యటనలో మోదీ

  • ఐరాసలో భారత శాశ్వత సభ్యత్వానికి ఆ దేశం సంపూర్ణ మద్దతు

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, జూలై 5: ట్రినిడాడ్‌, టుబాగో దేశంలో నివసిస్తున్న భారత సంతతి ప్రజల్లో ఆరో తరం వారికి కూడా ప్రవాస భారతీయ పౌరసత్వ(ఓసీఐ) కార్డులు ఇవ్వనున్నట్లు ఆ దేశ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. ద్వీప దేశమైన ట్రినిడాడ్‌, టుబాగోలో 40 శాతం మంది భారత సంతతి వారే. అయితే వీరంతా బ్రిటీషు వారి పాలనా కాలంలో అక్కడికి వెళ్లారు. దీంతో ప్రస్తుతం వారి వద్ద ఎటువంటి భారతీయ గుర్తింపు కార్డులు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మోదీ ఈమేరకు ప్రకటించారు. కాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి ట్రినిడాడ్‌, టుబాగో పూర్తి మద్దతు ప్రకటించింది. ఈమేరకు రెండు దేశాలు శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.


ప్రధాని నరేంద్ర మోదీ.. ట్రినిడాడ్‌, టుబాగో ప్రధాని కమ్లా పెర్సాద్‌ బిసెస్సర్‌ మధ్య జరిగిన చర్చల్లో రెండు దేశాల మధ్య ఆరు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, డిజిటల్‌ సాంకేతికత, ఏకీకృత చెల్లింపుల వంటి వాటిలో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఆ దేశ మహిళా క్రికెటర్లకు భారత్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. 2027-28 సంవత్సరానికి ఐరాస భద్రతా మండలిలో ట్రినిడాడ్‌, టుబాగో సభ్యత్వానికి, 2028-29 సంవత్సరానికి భారత సభ్యత్వానికి మద్దతు ఇవ్వాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నివారించాల్సిందేనని ఇరు దేశాలు నిర్ణయించాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇండియా-కారికోమ్‌ భాగస్వామ్యం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. కారిబ్బియన్‌ ప్రాంతంలోని 15 సభ్య దేశాలతో కూడినదే కారికోమ్‌. మోదీ తన పర్యటనలో ద్వీప దేశ అధ్యక్షురాలు క్రిస్టిన్‌ కార్లా కాంగలూను కూడా కలుసుకొన్నారు. కాగా మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం(స్థానిక కాలమానం ప్రకారం) అర్జెంటీనా చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు.

Updated Date - Jul 06 , 2025 | 03:06 AM