Share News

PM Modi: నేషన్ ఫస్ట్‌ నుంచి నారీ శక్తి వరకూ ప్రగతిపథంలో భారత్.. మోదీ శక్తివంతమైన ప్రసంగం

ABN , Publish Date - Dec 06 , 2025 | 09:30 PM

భారతదేశ అభివృద్ధిలో నారీ శక్తి పాత్ర ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రతి రంగంలోనూ మన ఆడకూతుళ్లు తమదైన ముద్ర వేసుకుంటున్నారని, ఆటంకాలు తొలగించుకుంటూ దూసుకు వెళ్తున్నారని, గగనతలంలోనూ తమ శక్తిసామర్థ్యాలను చాటుకుంటున్నారని ప్రశంసించారు.

PM Modi: నేషన్ ఫస్ట్‌ నుంచి నారీ శక్తి వరకూ ప్రగతిపథంలో భారత్.. మోదీ శక్తివంతమైన ప్రసంగం
PM Modi

న్యూఢిల్లీ: భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉందని, ప్రపంచంలోని సవాళ్ల మధ్య భారతదేశం వేరే లీగ్‌లో కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. శనివారంనాడిక్కడ జరిగిన 23వ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌-2025 (HTLS-2025)లో ప్రధాని శక్తివంతమైన కీలకోపన్యాసం చేశారు. భారతదేశ వృద్ధి రేటు నుంచి మహిళా సాధికారత వరకూ పలు అంశాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.


భారతదేశం సాధిస్తున్న వృద్ధిని ప్రధాని హైలైట్ చేస్తూ, 'నేషన్ ఫస్ట్ పాలసీ'కి అనుగుణంగానే ఇవాళ్టి సంస్కరణలన్నీ ముందుకు సాగుతున్నాయని చెప్పారు. అనిశ్చితి ప్రపంచంలో సంస్కరణల ఆధారిత ఆర్థిక ఎజెండా కారణంగా పురోగతికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా భారత్ నిలుస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మందగమనం నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా ముందుకు వెళ్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని గుర్తు చేశారు. ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ చోదక శక్తిని నిరూపిస్తోందన్నారు. ఇది కేవలం నంబర్ మాత్రమే కాదని, మన బలమైన స్థూల ఆర్థిక వ్యవస్థకు సూచిక అని తెలిపారు. గరిష్ఠ వృద్ధి, కనిష్ఠ ద్రవ్యోల్బణానికి ఇండియా మోడల్‌గా నిలుస్తోందని చెప్పారు.


భారతదేశ అభివృద్ధిలో నారీ శక్తి పాత్ర ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రతి రంగంలోనూ మన ఆడకూతుళ్లు తమదైన ముద్రవేసుకుంటున్నారని, ఆటంకాలు తొలగించుకుంటూ ముందుకు వెళ్తున్నారని, గగనతలంలోనూ తమ శక్తిసామర్థ్యాలను చాటుకుంటున్నారని ప్రశంసించారు.


మూడు రోజుల సమ్మిట్‌లో భాగంగా ప్రధాని ముగింపు ఉపన్యాసం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నటులు హుగ్ గ్రాంట్, అమీర్ ఖాన్ తదితర ప్రముఖలు చివరిరోజు సమ్మిట్‌లో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

అయోధ్య తర్వాత టార్గెట్‌పై యోగి ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ దేశాలతో భారత్ బంధాలను ఎవరూ వీటో చేయలేరు: జైశంకర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2025 | 10:03 PM