Op Sindoor New Video: పాక్ ఉగ్రశిబిరాలపై ఆపరేషన్ సిందూర్.. ఇండియన్ ఆర్మీ కొత్త వీడియో
ABN , Publish Date - Sep 03 , 2025 | 08:23 PM
భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకోవడం, దాన్ని భారత్ తిప్పికొట్టిన క్రమంలో దీనిపై అంతర్జాతీయ సమాజంలో తలెత్తిన ప్రశ్నలకు కూడా ఈ వీడియో సమాధానం ఇచ్చింది.
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి ప్రతిగా మే 7న 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)తో దాయాది దేశానికి భారత్ తిరుగులేని గుణపాఠం చెప్పింది. పాక్‌లోపలకు చొచ్చుకెళ్లి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను సైన్యం నేలమట్టం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉగ్రవాదానికి ఎంతమాత్రం సహించేది లేదని పాక్‌కు బలమైన సందేశం ఇచ్చింది. ఆ తర్వాత రెండు రోజులు భారత సరిహద్దుల్లోని జనావాసాలపై పాక్ డ్రోన్లు, క్షిపణలతో దొంగదెబ్బ తీసే ప్రయత్నం చేయగా భారత సైన్యం వాటిని పేకమేడల్లా కుప్పకూల్చింది. దీంతో చేతులెత్తిన పాక్ కాల్పుల విరమణ ప్రతిపాదన చేయడంతో ఆపరేషన్ సింధూర్ లక్ష్యం నెరవేరిన కారణంగా భారత్ అందుకు సమ్మతించింది. పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ హైలైట్స్, కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించాల్సిందనే అంశాలను హైలైట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ నార్తరన్ కమాండ్ తాజాగా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక కొత్త వీడియోను విడుదల చేసింది.
'సంయమనం, నిర్మయాత్మక స్పందనకు ప్రతీక.. మేలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్' అని ఇండియన్ ఆర్మీ ఆ వీడియాలో పేర్కొంది. ఉగ్రస్థావరాలపై కచ్చితత్వంతో దాడులు జరిపి పహల్గాం ఊచకోతకు పాల్పడిన ముష్కరులను మట్టుబెట్టిందని, తద్వారా ఈ ప్రాంతంలో శాంతి స్థాపనే తమ లక్ష్యమని భారత్ చెక్కుచెదరని సంకల్పాన్ని చాటుకుందని తెలిపింది.
భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకోవడం, దాన్ని భారత్ తిప్పికొట్టిన క్రమంలో దీనిపై అంతర్జాతీయ సమాజంలో తలెత్తిన ప్రశ్నలకు కూడా ఈ వీడియో సమాధానం ఇచ్చింది. సార్వభౌమాదికారం కలిగిన దేశంగా భారత్ మూడో పార్టీ మధ్యవర్తిత్వాన్ని అనుమతించదని ఈ వీడియోలో ఆర్మీ స్పష్టమైన సందేశాన్ని కూడా ఇచ్చింది. ఉగ్రవాదాన్ని తుదముట్టించేంత వరకూ భారత్ పోరు ఆగదనే స్పష్టమైన సందేశంతో ఈ వీడియో ముగిసింది.
ఇవి కూడా చదవండి..
యమునా నది ఉధృతి.. వాగుల్లా వీధులు, మడుగుల్లా మార్కెట్లు
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టీఆర్ఎఫ్‌కు నిధులు అందించినది వీరే
For More National News And Telugu News