Wife Bites as Snake: ‘నా భార్య పాములా మారి కాటేస్తోంది’.. భర్త వింత వాదన..
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:52 PM
సార్ నా భార్య నసీమున్ రాత్రి సమయంలో పాములా మారి నన్ను కాటు వేయడానికి ప్రయత్నిస్తోంది. నన్ను పరుగెత్తిస్తోంది అని..
ఉత్తరప్రదేశ్, అక్టోబర్ 07: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘పున్నమినాగు’ సినిమా మీకు గుర్తుందా..? ఈ సినిమాలో పౌర్ణమి రోజున అర్ధరాత్రి అయ్యిందంటే చాలు చిరంజీవి పాములా మారిపోతుంటాడు. తాను ఏం చేస్తున్నాడనేది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అచ్చం ఇలాంటి పరిస్థితే తన ఇంట్లో.. తాను ఎదుర్కొంటున్నట్లు ఓ వ్యక్తి చెబుతున్నాడు. అవును.. అర్ధరాత్రి అయితే చాలు తన భార్య పాములా మారిపోతుందని.. తనను కాటేసేందుకు ప్రయత్నిస్తోందంటూ ఓ వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
సమాధాన్ దివాస్(ప్రజా ఫిర్యాదుల రోజు) సందర్భంగా స్థానిక ప్రజలు సాధారణంగా విద్యుత్, రోడ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన సమస్యలను జిల్లా మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకువస్తారు. అయితే, మహమూదాబాద్ ప్రాంతంలోని లోధ్సా గ్రామానికి చెందిన మెరాజ్ మాత్రం వింత సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చాడు. ‘సార్ నా భార్య నసీమున్ రాత్రి సమయంలో పాములా మారి నన్ను కాటు వేయడానికి ప్రయత్నిస్తోంది. నన్ను పరుగెత్తిస్తోంది’ అని అధికారులకు ఫిర్యాదు చేశాడు. ‘నా భార్య నన్ను చంపడానికి చాలాసార్లు ప్రయత్నించింది. కానీ, ప్రతిసారీ ఆమె నుంచి తప్పించుకుని బ్రతికి బయటపడ్డాను. ఆమె దాడి చేసే సమయానికి సరిగ్గా మేల్కొనడంతో.. ప్రమాదం తప్పింది. నా భార్య నన్ను మానసికంగా హింసిస్తోంది. ఏ రాత్రి అయినా తను నన్ను చంపే అవకాశం ఉంది. దయచేసి నన్ను కాపాడండి’ అంటూ సదరు అధికారిని చేతులు జోడించి వేడుకున్నాడు.
అయితే, ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నువ్వు కూడా కోబ్రాలా మారిపోండి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నాగమణి దొంగిలించావేమో అని కొందరు స్పందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఈ వ్యవహారాన్ని అధికారులు సీరియస్‌గానే తీసుకున్నారు. హత్య కుట్ర ఏమైనా ఉండొచ్చని భావించిన జిల్లా మెజిస్ట్రేట్.. విచారణకు ఆదేశించారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Also Read:
ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు..
మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. 3 తేడాలు కనిపెట్టండి..
For More National News and Telugu News..