Students Donation: రూ.100 కోట్ల విరాళం..గొప్ప మనసు చాటుకున్న విద్యార్థులు
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:40 PM
ఈ మధ్య కాలంలో చాలా మంది సొంత లాభం లేనిదే ఏ పనీ చేయడం లేదు. అలాంటిది తాము చదువుకున్న విద్యా సంస్థ కోసం విద్యార్థులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ విద్యార్థులు ఏం చేశారు? ఎందుకు దేశం మొత్తం వాళ్లను పొగుడుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
‘గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరహ.. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’ ఈ ప్రపంచంలో మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే.. జ్ఞానాన్ని ఇచ్చేది గురువు. అందుకే గురువును దైవంతో పోలుస్తారు. తన స్టూడెంట్ గొప్ప స్థాయికి వస్తే.. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా సంతోషపడేది ఒక్క గురువే. గొప్ప స్థాయికి వస్తే.. నువు చదువుకున్న విద్యాసంస్థను మర్చిపోవొద్దు అంటారు. ఐఐటీ కాన్పూర్‌లో ఒక గొప్ప సంఘటన జరిగింది. తమకు విద్యాబుద్దులు నేర్పించి.. సొసైటీలో గొప్ప పొజీషన్‌లో స్థిరపడేలా చేసిన విద్యాలయానికి తమ వంతు సాయం చేయాలని భావించారు పూర్వ విద్యార్థులు. అంతే అందరూ తమకు తోచిన విరాళం ఇచ్చారు. ఆ విరాళం ఏకంగా రూ.100 కోట్లు చేరుకుంది. ఇప్పుడు యావత్ దేశం ఆ పూర్వ విద్యార్ధుల గొప్పతనం గురించి చర్చించుకుంటుంది.
IIT కాన్పూర్‌లో చదువుకున్న పూర్వ విద్యార్థులు(2000 సంవత్సరానికి చెందిన బ్యాచ్) తమ విద్యా సంస్థపై గొప్ప ప్రేమను చాటుకున్నారు. దేశ విదేశాల్లో ఉన్న విద్యార్థులు అంతా కలిసి విద్యా సంస్థకు తమ వంతు ఏదైనా చేయాలని భావించారు. అందరూ విరాళాలు ఇచ్చారు..అవి కాస్త రూ.100 కోట్లకు చేరుకుంది. వారంతా విద్యా సంస్థ ప్రాంగణంలో జరిగిన రజతోత్సవ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని తాము సేకరించిన విరాళం గురించి ఒక ప్రకటన చేశారు. తమ భవిష్యత్‌ని గొప్పగా తీర్చిదిద్దిన విద్యా లయం, గురువులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. విద్యార్థులు తాము చదువుకున్న విద్యా సంస్థ కోసం ఇంత పెద్ద మొత్తంలో విరాళం సేకరించడం దేశంలో ఇదే ప్రధమం.
ఐఐటీ-కాన్పూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మిలేనియం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొసైటీ ’ ఏర్పాటుకు ఆ డబ్బు వినియోగించాల్సిందిగా విద్యార్థులు కోరారని అన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నతమైన పొజీషన్‌లో ఉండటం ఎంతో గర్వంగా ఉంది’ అన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ..‘ఈ సమిష్టి విరాళం ఒక విద్యార్థికి తాను చదువుకున్న విద్యాలయాన్ని ఎప్పటికీ గుర్తు ఉంచుకోవాని చెప్పడం కోసం, ఐఐటీ కాన్పూర్‌తో మాకు ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేం’ అని అన్నారు. ఐఐటీ కాన్పూర్ 1959 లో స్థాపించబడింది. భారత ప్రభుత్వం ఈ సంస్థకు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ హూదాను ఇచ్చింది. ఏ విద్యార్థి అయినా ఈ కాలేజ్ లో సీట్ వచ్చిందంటే దేవుడి వరంగా భావిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest National News