DK on RSS Anthem Row: కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించా.. కాంగ్రెస్ వ్యక్తిగానే మరణిస్తా
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:55 PM
పార్టీలకు అతీతంగా తనకు ఎందరో మిత్రులు, అనుచరులు ఉన్నారని, అందరి మనోభావాలను గౌరవిస్తానని డీకే శివకుమార్ తెలిపారు. తాను ఎవరికన్నా పెద్ద కాదని, కష్ట సమయంలో ఎవరున్నా వారికి అండగా నిలబడేందుకు తాను జీవితాంతం కట్టుబడి ఉంటానని చెప్పారు.
బెంగళూరు: అసెంబ్లీలో ఒక చర్చ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ప్రార్థనా గీతాన్ని ఆలపించడం చర్చనీయాంశం కావడంతో కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజాగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం ఆలాపనపై కాంగ్రెస్ నేతలు, విపక్ష 'ఇండియా' కూటమి పార్టీల మనోభావాలను గాయపరిచి ఉంటే తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధమని అన్నారు.
మంగళవారంనాడిక్కడ మీడియాతో డీకే శివకుమార్ మాట్లాడుతూ, బీజేపీని విమర్శించేందుకు తాను ఆ పాట పాడానని వివరణ ఇచ్చారు. అయితే కొందరు రాజకీయ ప్రయోజనాలతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అన్నారు. అలా ఎవరైనా అనుకుంటే క్షమాపణలు చెబుతానని చెప్పారు. 'నేను తప్పు చేశానని అనుకోవడం లేదు. తప్పు చేశానని ఎవరైనా అనుకుంటే ఇప్పటికీ క్షమాపణ చెప్పేందుకు నేను సిద్ధమే' అని అన్నారు.
గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌పై తనకు తిరుగులేని నిబద్ధత ఉందని, తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని డీకే స్పష్టం చేశారు. 'గాంధీ కుటుంబం నాకు దైవం. కాంగ్రెస్ వ్యక్తిగానే పుట్టాను. కాంగ్రెస్ వ్యక్తిగానే మరణిస్తాను' అని చెప్పారు. పార్టీలకు అతీతంగా తనకు ఎందరో మిత్రులు, అనుచరులు ఉన్నారని, అందరి మనోభావాలను గౌరవిస్తానని తెలిపారు. తాను ఎవరికన్నా పెద్ద కాదని, కష్ట సమయంలో ఎవరున్నా వారికి అండగా నిలబడేందుకు తాను జీవితాంతం కట్టుబడి ఉంటానని చెప్పారు.
అసలేం జరిగింది?
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై ఆగస్టు 21న అసెంబ్లీలో జరిగిన చర్చలో డీకే పాల్గొంటూ, ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం 'నమస్తే సదా వత్సలే మాతృభుమే'లోని రెండు లైన్స్ ఆలపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంభవించిన తొక్కిసలాట ఘటన వివరాలు తనవద్ద ఉన్నాయని చెబుతూ... ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. దీనిపై బీజేపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్ దీనిపై స్పందించారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రార్థనా గీతం ఆలపించి ఉంటే.. ఈ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్‌తో సహా అందరికీ చెందినది కాబట్టి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఆయన గీతం ఆలపించి ఉంటే ఆయన క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
దంపతులపై అనుమానం.. ఆపి తనిఖీ చేయగా షాకింగ్ సీన్..
For More National News