PM Modi: ఒత్తిడి పెరిగినా భరిస్తాం..
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:03 AM
మనపై ఒత్తిడి పెరుగొచ్చు. కానీ, మనం దాన్ని భరిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి భారత్ వస్తువులపై అమెరికా 50ు సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
రైతులు, పశు పోషకులు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలపై రాజీ పడం
అమెరికా 50% సుంకాల అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ
అహ్మదాబాద్, ఆగస్టు 25: ‘మనపై ఒత్తిడి పెరుగొచ్చు. కానీ, మనం దాన్ని భరిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి భారత్ వస్తువులపై అమెరికా 50ు సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని మోదీ సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పలు పథకాలను ప్రారంభించి.. రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రైతులు, పశు పోషకులు, చిన్న పారిశ్రామికవేత్తల ప్రయోజనాల విషయమై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే ఆర్థిక ప్రయోజనాల చుట్టూ ప్రపంచ రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు. రక్షణ, శక్తికి మారుపేరుగా నిలిచిన ‘సుదర్శన చక్రధారి శ్రీకృష్ణుడు.. జాతీయోద్యమంలో రాట్నంపై నూలు వడికి స్వదేశీ దుస్తులు వాడాలన్న మహాత్మాగాంధీ బాటలో భారత్ సాధికారత సాధించిందని మోదీ చెప్పారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో సైనికుల ధైర్యం, గాంధీజీ మార్గం ప్రతిబింబించిందని ఆయన తెలిపారు. కానీ, 60-65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. దిగుమతి కుంభకోణాలకు పాల్పడేందుకు విదేశాలపై దేశం ఆధార పడేలా చేసిందన్నారు. గాంధీజీ బోధించిన ముఖ్య సూత్రాలను కాంగ్రెస్ పార్టీ గాలికొదిలేసిందని, ఆత్మను చిదిమేసి దశాబ్దాలుగా అధికారంలోకి రావడానికి ఆయన పేరును వాడుకుంటుందని మోదీ ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా, భారత్, పసిఫిక్ ద్వీప దేశం ఫిజీ మధ్య ఏడు అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. మూడు రోజుల పర్యటనకుగాను ఫిజీ ప్రధాని సితివేని రబూకా ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్నారు.