Mysore Dasara Festival: బాను ముస్తాక్‌కు ఆహ్వానంపై పిటిషన్లను తోసిపుచ్చిన హైకోర్టు
ABN , Publish Date - Sep 15 , 2025 | 03:56 PM
బాను ముస్తాక్ కొన్ని నెలల క్రితం హిందూ వ్యతిరేక, కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని పిటిషనర్లు వాదించారు. దసరా ప్రారంభోత్సవంలో చాముండేశ్వరి దేవత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని, వేదాలను పఠించాలని తెలిపారు.
బెంగళూరు: చరిత్రాత్మక మైసూరు దసరా వేడుకలను (Mysore Dasara Festival) ప్రారంభించడానికి బుకర్ ప్రైజ్ విజేత (Booker Prize winner) బాను ముస్తాక్ (Bhanu Mushtaq)ను ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) సోమవారం నాడు తోసిపుచ్చింది. పార్లమెంటు మాజీ సభ్యుడు ప్రతాప్ సింహాతో సహా నాలుగు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను విచారణకు స్వీకరించేందుకు ప్రధాన న్యాయమూర్తి విభు భక్రు, న్యాయమూర్తి సీఎం జోషితో కూడిన డివిజన్ బెంచ్ నిరాకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి వేరే మతవిశ్వాసాలు కలిగిన వ్యక్తిని ఆహ్వానించడం చట్ట ఉల్లంఘనగా కానీ, రాజ్యాంగపరమైన హక్కులను ఉల్లంఘించడంగా కానీ తాము భావించడం లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది.
బాను ముస్తాక్ కొన్ని నెలల క్రితం హిందూ వ్యతిరేక, కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని పిటిషనర్లు వాదించారు. దసరా ప్రారంభోత్సవంలో చాముండేశ్వరి దేవత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని, వేదాలను పఠించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి బాను ముస్తాక్ తగిన వారు కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు హాజరైన అడ్వకేట్ జనరల్ కె.శశికిరణ్ షెట్టి తన వాదన వినిపిస్తూ, ఉత్సవాల ప్రారంభించే వ్యక్తిగా ఎవరిని ఆహ్వానించాలనే దానిపై ఏర్పాటు చేసిన కమిటీలో అన్ని పార్టీలకు చెందిన స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, తక్కిన భాగస్వాములంతా ఉన్నారని తెలిపారు. దసరా పండుగ రాష్ట్ర పండుగ అని, పిటిషన్లను డిస్మిస్ చేయాలని కోర్టును కోరారు.
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకూ 11 రోజులపాటు మైసూరులో దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. తొలిరోజు ఆహ్వానితులతోపాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, అధికారులు పాల్గొంటారు. చాముండేశ్వరిదేవికి పుష్పార్చన ద్వారా శ్రీకారం చుట్టే ఉత్సవాలలో ప్రతిరోజూ సాహిత్య, సాంస్కృతిక, నృత్య కళా ప్రదర్శనలు ఉంటాయి. జంబూసవారి రోజున 750 కేజీల బంగారు అంబారిపై చాముండేశ్వరిదేవిని ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. పూల ప్రదర్శన, వస్తు ప్రదర్శనతోపాటు మైసూరు నగరమంతటా ప్రత్యేకమైన విద్యుద్దీపాల అలంకరణలు ఉంటాయి. ఎయిర్‌షో, హెలిటూరిజం వంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతాయి. మరోవైపు రాజసంప్రదాయంలో భాగంగా మైసూరుప్యాలెస్ లో యువరాజు యదువీర్ బంగారు సింహాసనంపై ఆశీనులై ప్రైవేట్ దర్బార్ నిర్వహిస్తారు. జంబూసవారి పూజ ప్యాలెస్‌లో ప్రత్యేకంగా జరుగుతుంది.
ఇవి కూడా చదవండి..
అందుకే పెద్దాయన అప్లికేషన్ తీసుకోలేదు.. సురేష్ గోపి వెల్లడి
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
For National News And Telugu News