Suresh Gopi: అందుకే పెద్దాయన అప్లికేషన్ తీసుకోలేదు.. సురేష్ గోపి వెల్లడి
ABN , Publish Date - Sep 15 , 2025 | 02:46 PM
త్రిసూర్‌లో ఈనెల 12 జరిగిన ఒక కార్యక్రమంలో వేలాయుధన్ అనే పెద్దాయన సురేష్ గోపి వద్దకు వచ్చి తనకు ఇల్లు మంజూరయ్యేలా సాయం చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ ఇవ్వబోయారు.
త్రిసూర్: తనకు ఇల్లు కావాలంటూ ఇటీవల ఒక పెద్దాయన ఇచ్చిన అప్లికేషన్‌ను కేంద్ర మంత్రి సురేష్ గోపి (Suresh Gopi) తిరస్కరించడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై కేంద్ర మంత్రి తాజాగా స్పందించారు. ఎలాంటి పనులు చేయగలను, ఎలాంటివి చేయలేననే విషయంలో తనకంటూ ఒక స్పష్టత ఉందని చెప్పారు. చేయలేని పనుల విషయంలో హామీలు ఇవ్వలేనని అన్నారు.
త్రిసూర్‌లో ఈనెల 12 జరిగిన ఒక కార్యక్రమంలో వేలాయుధన్ అనే పెద్దాయన సురేష్ గోపి వద్దకు వచ్చి తనకు ఇల్లు మంజూరయ్యేలా సాయం చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ ఇవ్వబోయారు. అయితే దానిని తీసుకునేందుకు సురేష్ గోపి నిరాకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో ఆయనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై మంత్రి తన ఫేస్‌బుక్ పేజీలో వివరణ ఇచ్చారు. కొందరు ఈ విషయాన్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారని తప్పుపట్టారు. ఒక ప్రజాప్రతినిధిగా తాను ఏమి చేయగలనో, ఏమి చేయలేననే విషయాల్లో తనకు చాలా స్పష్టత ఉందని చెప్పారు. సాధ్యంకాని హామీలు తాను ఇవ్వలేనని అన్నారు. ఎవరికీ ఆశలు కల్పించలేనని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పారు.
కాగా, వృద్ధుడికి ఇల్లు ఇప్పిస్తామని మరో రాజకీయ పార్టీ ముందుకు వచ్చింది. దీనిపై సురేష్ గోపి స్పందిస్తూ, అది కూడా మంచిదేనని, దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు ఉన్నా వారికి సొంత ఇల్లు ఇవ్వడం ముఖ్యమని అన్నారు. ప్రజలు పడే ఇబ్బందుల విషయంలో రాజకీయ గేమ్స్‌కు తావులేదని ఆయన మరోమారు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
మళ్లీ ఎన్‌కౌంటర్.. మరో అగ్రనేత హతం
For National News And Telugu News