Heavy Rains: బెంగళూరులో వర్ష బీభత్సం
ABN , Publish Date - May 20 , 2025 | 04:33 AM
కర్ణాటక రాజధాని బెంగళూరులో వర్ష బీభత్సం సృష్టించింది. నగరవ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది.
ఎడతెరిపి లేకుండా వాన
పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు
చెరువులను తలపించిన రోడ్లు
రబ్బరు బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు
రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు!
11 జిల్లాలకు ఎల్లో అలర్ట్
బెంగళూరు, మే 19(ఆంధ్రజ్యోతి)/ముంబై: కర్ణాటక రాజధాని బెంగళూరులో వర్ష బీభత్సం సృష్టించింది. నగరవ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. నగరంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు లోతట్టు ప్రాంతాలతో పాటు వాహనాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై నీళ్లు చెరువులను తలపించాయి. హెణ్ణూరు ప్రాంతంలోని ఓ అనాథాశ్రమంలోకి వర్షపు నీరు చేరడంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం దాకా మంచాల పైనుంచి దిగే పరిస్థితి లేదు. కేఆర్ పురం పరిధిలోని సాయి లేఅవుట్‌లో ప్రజలు రెండో రోజూ ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. కాలనీలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. స్థానిక ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ ఎక్స్‌కవేటర్‌పై ఎక్కి వివిధ ప్రాంతాలను సందర్శించారు. డ్రోన్‌ల ద్వారా పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు కొనసాగించారు. రబ్బరు బోట్లు ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యలహంకలోని అట్టూరు ప్రాంతంలో విశ్వనాథ ఆలయం నీట మునిగింది. ఈ ప్రాంతంలోని ఇళ్లలోకి కూడా నీరు చేరింది.
నెలమంగళ మార్గంలో జాతీయ రహదారి సర్వీస్ రోడ్లపై నాలుగు అడుగులకుపైగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సివిల్ డిఫెన్స్, పోలీసులు, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మహదేవపురలోని చన్నసంద్ర వద్ద రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న శశికళ(35) అనే మహిళపై గోడ కూలిపడటంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. కోరమంగళలోని అపార్ట్‌మెంట్‌లలోకి నీరు చేరింది. ఈ ప్రాంతంలో పలు ఇళ్లలోకి నీరు చేరి, ఎలక్ట్రికల్ వస్తువులు పాడైపోయాయి. నగరవ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం మరోసారి వర్షం కురిసింది. ఈ ప్రభావానికి ఎయిర్‌పోర్ట్ రోడ్డు ప్యాలెస్ గ్రౌండ్స్ వద్ద ఒక భారీ చెట్టు కూలి కారుపై పడింది. వర్ష ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తానని ప్రకటించిన సీఎం సిద్దరామయ్య.. ఉన్నఫళంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. వార్ రూంకు చేరుకుని అధికారులతో సమీక్ష జరిపారు. వివిధ ప్రాంతాల్లో వర్షం ప్రభావంపై ఆరా తీశారు. కాగా, వాయువ్య భారతం నుంచి వీచే పొడిగాలుల కలయికతో ఏపీలో పలుచోట్ల సోమవారం ఉదయం ముసురు వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి.
మహారాష్ట్రలో ఈనెల 25 వరకు వర్షాలు
మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఉరుములతో భారీ వర్షాలు కొనసాగాయి. రోజువారీ జనజీవనం స్తంభించడంతో పాటు రవాణా నిలిచిపోయింది. షిర్డీలోనూ భారీ వర్షాలు పడ్డాయి. కొల్హాపూర్‌లో పెనుగాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తుసరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ నాలుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను కొనసాగించింది. ఎల్లో అలర్ట్‌ను 29 జిల్లాలకు విస్తరించింది. ఇందులో ముంబై, థానే, పుణే వంటి నగర ప్రాంతాలు ఉన్నాయి. పుణేలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీడ్ జిల్లా రాల్సంగ్వి గ్రామంలో వరదలు సంభవించాయి. ఒక బ్రిడ్జి మునిగిపోవడంతో పాటు సమీపంలోని నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్‌అయ్యాయి. రానున్న రోజుల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, మధ్య రీజియన్లకు ఈ వర్షాలు విస్తరించనున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త అఖిల్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ నెల 25 వరకు మహారాష్ట్రలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News