Share News

PM Modi: దేశంలోని చొరబాటుదారులను వెనక్కి పంపుతాం

ABN , Publish Date - Sep 15 , 2025 | 06:30 PM

సొంత కుటుంబాల గురించి మాత్రమే ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తారని, తాము మాత్రం 'సబ్‌‌కా సాత్ సబ్‌కా వికాస్'నే విశ్వసిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. జీఎస్‌టీ తగ్గింపుల కారణంగా వంటింటి ఖర్చులు చాలా వరకూ తగ్గుతాయని వివరించారు.

PM Modi: దేశంలోని చొరబాటుదారులను వెనక్కి పంపుతాం
PM Modi

పూర్ణియా: దేశంలోని చొరబాటుదారులందర్నీ తమ ప్రభుత్వం వెనక్కి పంపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. రాష్ట్రీయ జనతా దళ్ (RJD), కాంగ్రెస్ (Congress) పార్టీలు రెండూ బిహార్ ఐడెంటిటీని ప్రమాదంలో పడేస్తున్నాయని విమర్శించారు. ఆర్జేడీ-కాంగ్రెస్ హయాంలో బిహార్ ఇబ్బందుల పాలైందని అన్నారు. పూర్ణియాలో సోమవారం నాడు పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. బిహార్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్, ఆర్జేడీ ఓర్వలేకున్నాయని, అందువల్లే అనవసరమైన అంశాలను లేవనెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. అయితే బిహార్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గట్టి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.


'ఈ రోజు సీమాంచల్, ఈస్ట్రన్ ఇండియాలో డొమోగ్రాఫిక్ సంక్షోభం తలెత్తింది. బిహార్, బెంగాల్, అస్సాం, చాలా రాష్ట్రాలు తమ ఆడకూతుళ్లు, సోదరీమణుల భద్రతపై ఆందోళనగా ఉన్నాయి. అందుకోసమే ఎర్రకోట నుంచి నేను డెమోగ్రఫీ మిషన్‌ను ప్రకటించాను. కానీ ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్, ఆర్జేడీలు చొరబాటుదారులకు కొమ్ముకాస్తూ నిస్సిగ్గుగా నినాదాలు చేస్తున్నాయి. బయట దేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులను కాపాడేందుకు యాత్రలు తీస్తున్నాయి' అని మోదీ విరుచుకుపడ్డారు.


సొంత కుటుంబాల గురించి మాత్రమే ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తారని, తాము మాత్రం 'సబ్‌‌కా సాత్ సబ్‌కా వికాస్'నే విశ్వసిస్తామని మోదీ చెప్పారు. జీఎస్‌టీ సంస్కరణలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గిన జీఎస్‌టీ సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ప్రజల పొదుపు పట్ల తనకున్న చిత్తశుద్ధి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. జీఎస్‌టీ తగ్గింపుల కారణంగా వంటింటి ఖర్చులు చాలా వరకూ తగ్గుతాయని వివరించారు. టూత్‌పేస్ట్ నుంచి సబ్బులు, షాంపూలు, నెయ్యి, ఇతర ఆహార పదార్ధాల ధరలు తగ్గుతాయని చెప్పారు. పేద ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

సమానత్వం ఉంటే మతం ఎందుకు మారుతారు? వివాదం రేపిన సీఎం వ్యాఖ్యలు

అక్రమ పద్ధతులని తేలితే మొత్తం ప్రక్రియనే పక్కన పెట్టేస్తాం... సుప్రీం కీలక వ్యాఖ్యలు

For National News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 07:25 PM