Ladakh Protests: అట్టుడికిన లెహ్.. నలుగురు మృతి
ABN , Publish Date - Sep 24 , 2025 | 09:42 PM
రాష్ట్రహోదా డిమాండ్‌లో భాగంగా పలువురు కొద్దిరోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తుండగా, తమ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు బుధవారంనాడు లద్దాఖ్ షట్‌డౌన్‌కు పిలుపునిచ్చారు.
శ్రీనగర్: లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌పై లెహ్ నగరం బుధవారంనాడు అట్టుడికింది. ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వరకూ గాయపడినట్టు అనధికార వర్గాల వెల్లడించాయి. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదాతో పాటు రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని వందలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగి రాళ్లతో దాడి చేశారు. బీజేపీ కార్యాలయంతో పాటు ఒక పోలీసు వాహనానికి నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. రాష్ట్రహోదా ఉద్యమం మొదలైన తర్వాత లద్దాఖ్‌లో జరిగిన తొలి హింసాత్మక ఘటన ఇదే.
రాష్ట్రహోదా డిమాండ్‌లో భాగంగా పలువురు కొద్దిరోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తుండగా, తమ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు బుధవారంనాడు లద్దాఖ్ షట్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. లద్దాఖ్ ప్రజల డిమాండ్లపై లెహ్ అపెక్స్ బాడీ ప్రతినిధులతో కేంద్ర అక్టోబర్ 6న చర్చలు జరపాలని నిర్ణయం తీసుకుంది. అయితే చర్చలు మరింత వేగంగా జరపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ గత రెండు వారాలుగా లద్దాఖ్‌లో నిరాహార దీక్షకు దిగారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదాతో పాటు ఆరో షెడ్యూల్ పొడిగింపునకు ఆయన డిమాండ్ చేస్తున్నారు. 35 రోజుల దీక్షలో భాగంగా సెప్టెంబర్ 10 నుంచి ఆమరణ దీక్షకు దిగారు. ఆయనతో పాటు మరో పదిహేను మంది దీక్షలో ఉన్నారు. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో లద్దాఖ్ ఎపెక్స్ బాడీ యువజన విభాగం తాజా నిరసనలకు, షట్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. నిరసలు కాస్తా హింసాత్మకంగా మారడంతో ఉద్యమం పక్కదారి పట్టడం తనకు బాధ కలిగించిందని, ప్రజలు హింసను వీడాలను, సమస్యను పక్కదారి పట్టించవద్దని కోరుతూ సోనం వాంగ్‌చుక్ తన ఆమరణ దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు.
కాగా, గత మూడేళ్లుగా లద్దాఖ్‌లో నేరుగా కేంద్రపాలనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలని, తమ భూములు, సంస్కృతి, వనరులు, ఉద్యోగాలకు రాజ్యాంగ పరమైన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్రి కల్పించే 370వ అధికరణ రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రం విభజించింది. ఇందులో భాగంగా 2019 ఆగస్టులో లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతమైంది. ఆ సమయంలో వాంగ్‌చుక్ సహా లెహ్‌లోని చాలామంది ఈ పరిణామాన్ని స్వాగతించారు. అయితే ఏడాదిలోనే లెఫ్టినెంట్ గవర్నర్ పాలన కింద లద్దాఖ్‌లో రాజకీయ శూన్యత ఏర్పడిందనే ఆందోళనలు ప్రజల్లో మొదలయ్యాయి. దీంతో నిరసనలు, నిరాహార దీక్షలకు దిగుతున్నారు. తొలిసారి బౌద్ధుల మెజారిటీ ఉన్న లెహ్, ముస్లిం మెజరిటీ కలిగిన కార్గిల్‌లోని రాజకీయ, మత గ్రూపులు 'ది ఎపెక్స్ బాడీ ఆఫ్ లెహ్ అండ్ ది కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్' పేరుతో ఐక్యవేదికగా ఏర్పడ్డాయి.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఎన్నికలు మోదీ అవినీతి పాలన అంతానికి నాంది: ఖర్గే
లద్దాఖ్‌లో భగ్గుమన్న నిరసనలు.. తెరపైకి రాష్ట్ర హోదా డిమాండ్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి