Share News

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా సభలకు అంతరాయం కల్పించేందుకు కుట్ర

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:31 AM

అన్నాడీఎంకే ప్రచారసభలోకి ఖాళీ అంబులెన్స్‌ రావడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మక్కలై కాప్పోం-తమిళగత్తై మీడ్పోం’ నినాదంతో గత నెల 7న ప్రారంభించిన ఈపీఎస్‌ ప్రచారయాత్రలో భాగం గా సోమవారం రాత్రి వేలూరు సమీపంలోని అనైకట్టు ప్రాంతంలో ఈపీఎస్‌ రోడ్‌షో నిర్వహించారు.

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా సభలకు అంతరాయం కల్పించేందుకు కుట్ర

చెన్నై: అన్నాడీఎంకే ప్రచారసభలోకి ఖాళీ అంబులెన్స్‌ రావడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి(Former CM Edappadi Palaniswami) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మక్కలై కాప్పోం-తమిళగత్తై మీడ్పోం’ నినాదంతో గత నెల 7న ప్రారంభించిన ఈపీఎస్‌ ప్రచారయాత్రలో భాగం గా సోమవారం రాత్రి వేలూరు సమీపంలోని అనైకట్టు ప్రాంతంలో ఈపీఎస్‌ రోడ్‌షో నిర్వహించారు. ఈపీఎస్‌ ప్రసంగిస్తున్న సమయంలో ఉన్నట్లుండి అక్కడకు ఖాళీ అంబులెన్స్‌ రావడంతో సభలో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు.


దీనిపై స్పందించిన ఈపీఎస్‌ ఇది డీఎంకే కుట్రేనని, తాను పాల్గొంటున్న ప్రచారసభల్లో ప్రజలు భారీసంఖ్యలో తరలివస్తుండటాన్ని చూసి ఓర్వలేక సభను భగ్నం చేసేందుకు ఇలా ఖాళీ అంబులెన్సును పంపించారని దుయ్యబట్టారు. సభలోకి దూసుకొచ్చిన వాహనం వల్ల ప్రజలకు గాయాలైతే తనపై నిందమోపవచ్చని, తాను ఇంతవరకు పాల్గొన్న 30 సభల్లో డీఎంకే నేతలు ఇలాంటి చేష్టలకు పాల్పడ్డారని, ఇలాంటి నీచ సంస్కృతికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.


తాను పాల్గొనబోయే తదుపరి సభలో రోగిలేకుండా అంబులెన్స్‌ వస్తే ఆ డ్రైవరే అదే అంబులెన్స్‌లో రోగిగా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుందని ఈపీఎస్‌ వ్యాఖ్యానించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను గోల్డెన్‌ అవర్‌లోగా ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్‌లకు దారివ్వాల్సిన బాధ్యత వాహన చోదకులదని, అయితే రోగిలేకుండా జనంలోకి అంబులెన్స్‌ రావడం మంచి పద్ధతి కాదన్నారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఎదుర్కొనే ధైర్యంలేకే అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోందని, వీటికి తాము భయపడేదిలేదని ఈపీఎస్‌ తేల్చిచెప్పారు. ధరల పెంపును నియంత్రించలేని డీఎంకే ప్రభుత్వం ప్రతిపక్షాలకు పెరుగుతున్న ప్రజాదరణతో ఓటమి భయం పట్టుకుందన్నారు.


దేశంలోనే ఉన్నత విద్యను చదువుకుంటున్న విద్యార్థులు అధికంగా ఉన్న రాష్ట్రంగా తమిళనాడును ముందుకు నడిపి చరిత్ర సృష్టించిన ఘనత అన్నాడీఎంకే ప్రభుత్వానిదేనని, అనైకట్టులో కొత్తగా రెండు ఆర్ట్స్‌ కళాశాలలను ప్రారంభించింది కూడా తామేనన్నారు. అదేవిధంగా అనైకట్టును కొత్త తాలూకాగా ప్రకటించడం, అగడంలో చెక్‌డ్యాం నిర్మించడం, అరియూర్‌లో రైల్వేవంతెన ఏర్పాటు చేసి వాహనాల రద్దీని తగ్గించామన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీబీ రాధాకృష్ణన్‌ను ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేసిన ఈపీఎస్‌ ఆయనకు ఓటేసి గెలిపించాలని డీఎంకే సహా అన్ని పార్టీలను కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

‘కన్ఫర్డ్‌’లుగా 17 మంది సిఫారసు!

విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను తీసేయండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 20 , 2025 | 11:31 AM