Deputy CM Bhatti Vikramarka: విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తీసేయండి
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:52 AM
విద్యుత్ స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను..
కేబుల్ ఆపరేటర్ల తీరు వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు
అనుమతుల్లేని విద్యుత్ కనెక్షన్లపై కఠిన చర్యలు: భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేబుల్ వైర్లను తొలగించాలని సంవత్సర కాలంగా కేబుల్ ఆపరేటర్లకు పలుమార్లు నోటీసులు ఇచ్చి.. తగినంత సమయం ఇచ్చామని, అయినా వారు స్పందించకపోవడంతో ప్రజల ప్రాణానికి ముప్పు ఏర్పడిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఉపేక్షించేది లేదని, రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, సిబ్బంది విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. అనుమతులు లేకుండా అక్రమంగా విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే కఠినంగా స్పందించి, వాటిని తొలగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతోనే విద్యుత్ కనక్షన్ తీసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తుల ద్వారా కనెక్షన్లు తీసుకోవడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడతోందని హెచ్చరించారు. హైదరాబాద్ మహానగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల్లోని పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం భట్టి విక్రమార్క అధ్యక్షత మంగళవారం సచివాలయంలో జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు పెట్టుబడులు కీలకమని, ఆర్థిక వనరులను జాగ్రత్తగా వినియోగించుకుంటూ ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఒకవైపు అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేస్తూనే మరోవైపు ఆదాయాన్ని పెంచేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు.