Election Commission: బిహార్, మరో 7 రాష్ట్రాలకు 470 మంది పరిశీలకులను నియమించిన ఈసీ
ABN , Publish Date - Sep 28 , 2025 | 06:19 PM
రాజ్యాంగంలోని 324వ నిబంధన, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 20బి కింద తమకు లభించిన ప్లీనరీ పవర్స్‌తో పరిశీలకులను నియమించినట్టు ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఈసీ పర్యవేక్షణ, క్రమశిక్షణ కింద వీరు పనిచేస్తారని వివరించింది.
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections), మరో ఏడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు (Assembly Bypolls) జనరల్, పోలీస్, ఎక్స్‌పెండిచర్ పరిశీలకులుగా 470 మంది అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ (Election commission of India) ఆదివారం నాడు నియమించింది. ఎన్నికలు సజావుగా, నిష్పాక్షికంగా నిర్వహించేలా అధికారులు తమ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపింది. 470 మంది అధికారుల్లో 320 మంది ఐఏఎస్‌లు, 60 మంది ఐపీఎస్‌లు, 90 మంది ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్, ఐసీఏఎస్ సర్వీసులకు చెందిన వారు ఉన్నారు.
ఎన్నికల పరిశీలకులు బిహార్‌లోని నియోజకవర్గాలతోపాటు బుద్గాం, నగ్రోటా (జమ్మూ అండ్ కశ్మీర్), అంతా (రాజస్థాన్), ఘాట్‌సిలా (జార్ఖాండ్), జూబ్లీహిల్స్ (తెలంగాణ), తరన్ తారన్ (పంజాబ్), డంపా (జార్ఖండ్), నువాపడా (ఒడిశా)లో పని చేయనున్నారు. రాజ్యాంగ నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌కు పరిశీలకులు సహకరిస్తారని, ఎప్పటికప్పుడు కమిషన్‌కు రిపోర్ట్ చేస్తుంటారని ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో తమకున్న సీనియారిటీ, సుదీర్ఘ అనుభవంతో ఎన్నికల సజావుగా జరిగేందుకు వీరంతా ఈసీకి సహకరిస్తారని, అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లను నియమించామని పేర్కొంది.
రాజ్యాంగంలోని 324వ నిబంధన, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 20బి కింద తమకు లభించిన ప్లీనరీ పవర్స్‌తో పరిశీలకులను నియమించినట్టు ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఈసీ పర్యవేక్షణ, క్రమశిక్షణ కింద వీరు పనిచేస్తారని వివరించింది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ బాబా అరెస్టు.. 2 నకిలీ విజిటింగ్ కార్డులు, 3 మొబైల్స్ స్వాధీనం
కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు టీవీకే
For More National News And Telugu News