Delhi Baba Arrest: ఢిల్లీ బాబా అరెస్టు.. 2 నకిలీ విజిటింగ్ కార్డులు, 3 మొబైల్స్ స్వాధీనం
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:53 PM
చైతన్యానంద సరస్వతి ఆలియాస్ పార్థసారథి శృంగేరి పీఠానికి అనుబంధంగా ఉన్న శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఇండియన్ మేనేజిమెంట్ కాలేజీలో చదువుతున్న పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కాగా, ఆయన్ని పోలీసులు శనివారం నాడు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: వసంత్‌కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజిమెంట్ కళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యానంద సరస్వతి (Chaitanyanand Saraswati)ని ఢిల్లీ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఆగ్రాలోని హోటల్ ఫస్ట్ తాజ్‌గంజ్ హోటల్‌లో బాబాను అరెస్టు చేసి లీగల్ ప్రొసీడింగ్స్ కోసం ఆదివారం ఉదయం ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచి తదుపరి విచారణ కోసం పోలీస్ కస్టడీని కోరనున్నారు.
చైతన్యానంద సరస్వతి ఆలియాస్ పార్థసారథి.. శృంగేరి పీఠానికి అనుబంధంగా ఉన్న శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఇండియన్ మేనేజిమెంట్ కాలేజీలో చదువుతున్న పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EWS) స్కాలర్‌షిప్ కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ మేనేజిమెంట్ కోర్సును ఈ కాలేజీ అందిస్తోంది.
2 నకిలీ విజిటింగ్ కార్డులు
ఢిల్లీ బాబా అరెస్టు సందర్భంగా ఆయన నుంచి రెండు నకిలీ విజిటింగ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ఒకటి యునైటెడ్ నేషన్స్‌కు చెందిన కార్డు ఉంది. యుఎన్‌కు తాను శాశ్వత రాయబారిగా బాబా చెప్పుకుంటున్నారు. రెండో విజిటింగ్ కార్డుకు సంబంధించి తాను బ్రిక్స్ దేశాల జాయింట్ కమిషన్ సభ్యుడిగా, భారత ప్రత్యేక రాయబారిగా బాబా చెబుతున్నారు.
కాగా, ఢిల్లీ బాబా నుంచి ఒక ఐఫోన్ సహా మూడు మొబైల్ ఫోన్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్న ఆయన.. బృందావాన్, ఆగ్రా, మధురతో సహా 15 ప్రదేశాల్లో హోటళ్లు మారుతూ బస చేసినట్టు విచారణలో తేలింది. తన పలుకుబడిని చాటుకునేందుకు ఆయన ప్రధాన మంత్రి కార్యాలయం పేరును కూడా దుర్వినియోగ పరిచినట్టు చెబుతున్నారు. పార్థసారథి అలియాస్ చైతన్యానంద సరస్వతి కోసం హర్యానా, రాజస్థాన్, యూపీ, పశ్చిమబెంగాల్‌లోనూ గాలించినట్టు డీసీపీ సౌత్-వెస్ట్ అమిత్ గోయెల్ తెలిపారు. పెద్దఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బాబాకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు ఇటీవల నిరాకరించింది.
ఇవి కూడా చదవండి..
కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు టీవీకే
మళ్లీ భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం
For More National News And Telugu News