Share News

ED Notices Urvashi Mimi: బెట్టింగ్ యాప్స్ కేసులో ఊర్వశి, మిమికి నోటీసులు

ABN , Publish Date - Sep 15 , 2025 | 09:33 AM

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు దేశంలో యువతను ఆకర్షిస్తూ, ఆర్థిక నష్టంతో పాటు చట్టపరమైన సమస్యలను సృష్టిస్తున్నాయి. దీనిపై ఫోకస్ చేసిన ఈడీ.. అలాంటి యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటోంది.

ED Notices Urvashi Mimi: బెట్టింగ్ యాప్స్ కేసులో ఊర్వశి, మిమికి నోటీసులు
ED Notices Urvashi Mimi

దేశంలో ఢిల్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఒక కీలక మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కీలకంగా మారాయి. ఈ బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియా, యాప్ స్టోర్లు, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు ప్రకటనల ద్వారా నడిచేవి. ఇప్పుడు ఈ కేసులో సినీ నటి మిమి చక్రవర్తి, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఈడీ సమన్లు జారీ చేసింది.


సమన్లు ఎందుకు?

ఈడీ అధికారులు చెప్పినట్లు ఈ ఇద్దరు ప్రముఖులు కొన్ని అక్రమ బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్లు చేశారని అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో వీరు వాటికి సంబంధించిన ప్రకటనల్లో పాల్గొన్నారా? పాల్గొంటే ఎలాంటి ఫీజులు తీసుకున్నారనే దానిపై ఈడీ విచారణ చేస్తోంది. గతంలో ఈ కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా కూడా విచారణకు హాజరయ్యారు. వారి నుంచి ఈడీ కీలక సమాచారం సేకరించింది.


బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తున్నాయంటే...

ఈ యాప్స్ ప్రస్తుతం నిషేధించబడిన జాబితాలో చేర్చబడ్డాయి. కానీ గతంలో సామాన్య ప్రజలకు ఆకర్షణీయమైన స్కీమ్స్ చూపించి, డబ్బులు వసూలు చేశారు. తర్వాత ఆ డబ్బును విదేశాలకు తరలిస్తూ మనీ లాండరింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి యాప్స్‌కు సోషల్ మీడియా, యూట్యూబ్, ఇతర వెబ్‌సైట్‌లు ప్రకటనల రూపంలో సహకరించాయి. గతంలో గూగుల్, మెటా (ఫేస్‌బుక్ మాతృ సంస్థ) ప్రతినిధులను కూడా ఈడీ విచారించింది.


బెట్టింగ్ మార్కెట్ విలువ

ఇప్పటివరకు 220 మిలియన్ల మంది భారతీయులు అక్రమ బెట్టింగ్ యాప్స్ వినియోగించారు. వారిలో 110 మిలియన్లు రెగ్యులర్ యూజర్లు. 2025 మొదటి మూడు నెలల్లోనే 1.6 బిలియన్ విజిట్స్ ఈ యాప్స్‌కి వచ్చాయి. భారతదేశంలో ఈ మార్కెట్ విలువ $100 మిలియన్ అని అంచనా. ఈ క్రమంలో ప్రతి ఏడాది సుమారు రూ.27,000 కోట్లు పన్ను ఎగ్గొట్టుతున్నారు.


కేంద్ర ప్రభుత్వం చర్యలు

దీంతో అప్రమత్తమైన కేంద్రం 2022 నుంచి జూన్ 2025 వరకు 1,524 బెట్టింగ్ వెబ్‌సైట్‌లు, యాప్స్‌ను బ్లాక్ చేసింది. అయినప్పటికీ, కొత్త పేర్లతో కొత్త యాప్స్ వస్తూనే ఉన్నాయి. సినిమా, క్రీడా రంగాల ప్రముఖులు వారికీ ఉన్న ఫాలోయింగ్‌ను వినియోగించుకుని ప్రచారం చేసుకుంటున్నాయి. ఈడీ ఇప్పటికీ ఈ కేసులో కొత్త ఆధారాలు సేకరిస్తోంది. కొత్తగా మరిన్ని ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే ఛాన్సుంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 09:52 AM