ECI: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణల క్రతువు.. నేడే అధికారిక ప్రకటన
ABN , Publish Date - Oct 27 , 2025 | 10:43 AM
దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాలలో సవరణలకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టబోతోంది. అధికారిక ప్రకటన ఈ సాయంత్రం వెలువడే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాలలో అనర్హులైన ఓటర్లను తొలగించడం, నిజమైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడానికి..
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాలలో సవరణలకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ సాయంత్రం వెలువడే అవకాశం ఉంది. Special Intensive Revision of electoral rolls (SIR) క్రతువులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాను నవీకరించడం, ధృవీకరించడం, అనర్హులైన ఓటర్లను తొలగించడం, నిజమైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడానికి ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఈ సాయంత్రం గం. 4:15 కు జరగనున్న విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
గత గురువారం ముగిసిన రెండు రోజుల ప్రధాన ఎన్నికల అధికారుల (CEOలు) సమావేశం తర్వాత, భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ మేనేజ్‌మెంట్ (IIIDEM)లో జరిగిన ఈ సమావేశంలో SIR ప్రక్రియ కోసం సన్నాహాలను ఖరారు చేయడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల CEOలు సమావేశమయ్యారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు అత్యంత కీలకమైన, కచ్చితమైన, సమగ్రమైన ఓటరు జాబితాలను నిర్ధారించడంపై ఆ సమావేశంలో దృష్టి సారించారు. దీనికి సంబంధించిన ఆవశ్యకతను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నొక్కి చెప్పారు.

కాగా, SIR మొదటి దశను 2026 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్‌తో సహా దాదాపు 10 రాష్ట్రాలను కవర్ చేస్తుందని భావిస్తున్నారు. ప్రాంతీయ ఎన్నికల సన్నాహాలకోసం ఎన్నికల సంఘం (ECI) ఇప్పటికే ఆయా రాష్ట్రాల CEOలతో ఒక్కొక్కరిగా మాట్లాడింది. పారదర్శకత, సమన్వయం, సమగ్ర సంసిద్ధత అవసరాన్ని నొక్కి చెబుతూ.. SIR క్రతువు కోసం సన్నాహాలు పూర్తి చేయాలని ECI అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. SIR ప్రక్రియ సజావుగా అమలు అయ్యేలా చూసేందుకు బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వాలని, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కూడా పోల్ ప్యానెల్ CEOలను ఆదేశించింది.
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
హైదరాబాద్ యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీ హబ్
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి