DMK: రాష్ట్రంలో బిహార్ తరహా సవరణలు వద్దు
ABN , Publish Date - Aug 14 , 2025 | 10:13 AM
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్ వెలువడక ముందే ఓటర్ల జాబితాను ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా సవరించాలే తప్ప, బిహార్ తరహా సవరణ చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం డిమాండ్ చేసింది.
- ఈసీకి డీఎంకే జిల్లానేతల డిమాండ్
చెన్నై: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్ వెలువడక ముందే ఓటర్ల జాబితాను ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా సవరించాలే తప్ప, బిహార్ తరహా సవరణ చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం డిమాండ్ చేసింది. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికల నిర్వహణకు పెనుముప్పు కలిగించేలా ఓట్ల చోరీ, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు పాల్పడుతున్న కేంద్ర ఎన్నికల సంఘం అప్రజాస్వామిక విధానాలను ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తూ ఓ తీర్మానం చేసింది.
తేనాంపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో బుధవారం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్(MK Stalin) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, కోశాధికారి టీఆర్‌బాలు, మంత్రి కేఎన్‌నెహ్రూ, ఐ పెరియసామి, ఎంపీలు తిరుచ్చి శివా, ఎ.రాజా, అందియూరు సెల్వరాజ్, కనిమొళి, ఆర్‌ఎస్ భారతి, టీకేఎస్ ఇలంగోవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బిహార్‌లో పౌరుల ఓటు హక్కులను హరించేలా కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్మక్కయిన బీజేపీ జరుపుతున్న ఓట్ల చోరీని, ప్రత్యేక సమగ్ర సవరణను ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సహా ఇండియా కూటమి నేతలను అరెస్టు లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి సాగిస్తున్న ఈ అక్రమాలు ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తాయన్నారు. ఎన్నికల ప్రక్రియకు మూలాధారమే ఓటర్ల జాబితా అని, ఆ జాబితాను లోపాలకు తావులేకుండా సవరించాలే తప్ప ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో వందల సంఖ్యలో ఓటర్లను తొలగించడం గర్హనీయమన్నారు. బిహార్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో జరిగిన ఓట్ల చోరీని డీఎంకే, ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా ఖండించినప్పటికీ సుప్రీం కోర్టు సామూహిక పరమైన తొలగింపులు (మాస్ డెలిషన్) ఉంటే జోక్యం చేసుకుంటామని హెచ్చరించిన తర్వాత కూడా ఆ రాష్ట్రంలో కుంటి సాకులు చెప్పి 65లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు.
జూలైలో డీఎంకే ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నట్లు చనిపోయిన ఓటర్ల తొలగింపు, బీఎల్వోలు, బీఎల్‌ఏలతో అనుసంధానించడం, ప్రాంతీయ, స్థానిక భాషల్లో మాన్యువల్స్ పంపిణీ, తపాలా ఓట్ల లెక్కింపులో ఎదురవుతున్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, నివాసస్థలం, జననతేదీలను తెలిపే నిర్థారణ పత్రాలకు అంగీకరించడం వంటి డిమాండ్లను ఆమోదించాలని రెండో తీర్మానంలో డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులకు వర్తింపజేసేలా చేసిన మూడో తీర్మానంలో ‘ఏకతాటిపై రాష్ట్రం’ పేరుతో జరుపుతున్న సభ్యత్వ కార్యక్రమాలను వేగిరపరచాలని జిల్లా కార్యదర్శులకు, పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. ఈ యేడాదిలోగానే సభ్యత్వ ముమ్మర కార్యక్రమాలు పూర్తిచేయాలని పార్టీ సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదు
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
Read Latest Telangana News and National News