Share News

Dharmendra Passes Away: ధర్మేంద్ర మృతి.. ప్రముఖుల సంతాపం..

ABN , Publish Date - Nov 24 , 2025 | 03:59 PM

బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర ముంబైలో మృతి చెందారు. ఆయన మృతి చెందడం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Dharmendra Passes Away: ధర్మేంద్ర మృతి.. ప్రముఖుల సంతాపం..

అమరావతి/ హైదరాబాద్, నవంబర్ 24: బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఆయన తన నటన ద్వారా గెలుచుకున్నారన్నారు. భారతీయ సినిమాకు ధర్మేంద్ర చేసిన సేవలు.. తరతరాలు మరిచిపోలేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపం తెలిపారు. వారికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు ట్విట్ చేశారు.


హీమ్యాన్‌గా పిలుచుకునే వారు: డిప్యూటీ సీఎం పవన్

బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందారని తెలిసి చింతించానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విలేకర్లతో మాట్లాడుతూ.. హిందీ చిత్ర పరిశ్రమలో తొలి తరం యాక్షన్ హీరోగా సినీ ప్రియులను ఆయన ఆకట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అందుకే ఆయన్ని యాక్షన్ కింగ్, హీ మ్యాన్ అని అభిమానంగా పిలుచుకునే వారని వివరించారు.


షోలే, చుప్కే చుప్కే, ధర్మ్ వీర్, సీతా ఔర్ గీత, యాదోం కి బారాత్ తదితర చిత్రాలతో నటనలో తనదైన శైలిని ధర్మేంద్ర చూపించారని చెప్పారు. 2004 నుంచి ఐదేళ్ల పాటు పార్లమెంట్‌ సభ్యుడిగా ధర్మేంద్ర ప్రజా జీవితంలో ఉన్నారని పేర్కొన్నారు. ధర్మేంద్ర సతీమణి హేమామాలినితోపాటు వీరి తనయులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.


చిత్ర పరిశ్రమకు తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రముఖ నటుడు ధర్మేంద్ర ముృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగంలో దిగ్గజం, దిగ్గజ వ్యక్తి ధర్మేంద్ర జీ మృతి చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, విశిష్ట నటుడిని కోల్పోవడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ఆయన చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. ధర్మేంద్ర కుటుంబ సభ్యులు, ఆయన మిత్రులతోపాటు అసంఖ్యాకంగా ఉన్న ఆయన అభిమానులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీలో డీకే విధేయులు.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం

For More National News And Telugu News

Updated Date - Nov 24 , 2025 | 04:21 PM