Udayanidhi: డిప్యూటీ సీఎం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారంటే..
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:41 AM
విద్వేష ప్రసంగాలతో సమాజంలోని మైనారిటీ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Dy CM Udayanidhi) ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిప్లికేన్‌లోని కలైవానర్ అరంగంలో రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
- ఫాసిస్ట్ శక్తుల దుష్ప్రచారం.. మైనార్టీ వర్గాలకు నష్టం
చెన్నై: విద్వేష ప్రసంగాలతో సమాజంలోని మైనారిటీ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Dy CM Udayanidhi) ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిప్లికేన్‌లోని కలైవానర్ అరంగంలో రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ... దేశంలోని ఫాసిస్ట్ శక్తులకు అసత్య వార్తలను ప్రచారం చేయడమే దినచర్యగా మారిపోయిందన్నారు. అసత్య వార్తలను ప్రచారం చేయడం వెనుక ఎలాంటి ఉద్దేశం ఉండదన్నారు.
కానీ, ఒక అంశాన్ని మార్చి ప్రచారం చేయడం అనేది పథకం ప్రకారం చేసే తప్పుడు ప్రచారం అని పేర్కొన్నారు. ఈ తరహా ప్రచారం చాలా ప్రమాదకరమైనదన్నారు. మరో రెండేళ్ళలో ఈ రెండు అంశాలు ప్రపంచానికి పెను ప్రమాదంగా మారతాయన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పశుమాంసం తినేవారిని పొడిచి చంపేస్తున్నారనే వార్తను ప్రచారం చేశారన్నారు. అలాగే, మన రాష్ట్రంలోని ఉత్తరాది వారిపై దాడులు జరుగుతున్నాయనే ప్రచారం చేశారన్నారు. ఈ అంశంపై ఉత్తరాదికి చెందిన ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్రానికి ఆహ్వానించి వాస్తవ పరిస్థితి వివరించారన్నారు.

పుట్టుకతో ఎవరూ ఉన్నత, అధమ వర్గాలకు చెందిన వారు కాదని మూడేళ్ళ క్రితం తాను వ్యాఖ్యానించారన్నారు. పుట్టుకలో ఎలాంటి హెచ్చుతగ్గులు లేవని పేర్కొన్నానని, అలాంటిది ఒకటి ఉంటే దాన్నివెంటనే నిర్మూలించాలని తాను మాట్లాడానని గుర్తు చేశారు. దీన్ని కూడా కొందరు వక్రీకరించి అసత్య ప్రచారం చేశారన్నారు. తాను చేసిన ప్రసంగాన్ని మార్చి దేశ వ్యాప్తంగా విష ప్రచారం చేశారన్నారు. ఈ వివాదంలో తన తలను తెగ నరికే వారికి రూ.10 లక్షల రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారన్నారు.
మరో స్వామీజీ పోటాపోటీగా ఉదయనిధి తలను నరికేసే వారికి రూ.కోటి రివార్డు ఇస్తామని ప్రకటించారన్నారు. ఆ వెంటనే క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారన్నారు. ఈ విషయంలో తాను ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా కోర్టు మెట్లెక్కేందుకు కూడా సిద్ధపడ్డానని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రచారమయ్యే వదంతులపై విద్యార్థులు, యువకులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వాస్తవాలు వివరించాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం
Read Latest Telangana News and National News