Delhi Police tells SC: మేథో ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకరం: ఢిల్లీ పోలీసులు
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:14 PM
భూమిపై పనిచేసే ఉగ్రవాదుల కంటే వారిని ప్రేరేపించి పనిచేయిస్తున్న వారు అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. 2020లో ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10న ఎర్రకోట పేలుడు ఘటన ఇందుకు నిదర్శనమని వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: క్షేత్రస్థాయిలో పనిచేసే ఉగ్రవాదుల కంటే వారిని నడిపిస్తున్న మేథో ఉగ్రవాదులు(Intellectual terrorists) అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ పోలీసులు(Delhi Police) ఉద్ఘాటించారు. దేశ రాజధాని ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లు(Delhi riots), నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు(Delhi Blast) ఘటన ఇందుకు నిదర్శమని.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు(ASG SV Raju) సుప్రీంకోర్టుకు తెలిపారు. ఢిల్లీ అల్లర్లు 2020కి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఉమర్ ఖలీద్(Umar Khalid), షార్జిల్ ఇమామ్(Sharjeel Imam) సహా పలువురి బెయిల్ పిటిషన్లను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు.
ఈ సందర్భంగా ఎస్వీ రాజు మాట్లాడుతూ.. వైద్యులు, ఇంజినీర్లు వంటివారు కొందరు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం కొత్త ట్రెండ్‌గా మారిందన్నారు. 2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు ముందు పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకంగా.. ఇమామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వీడియోలను నిరసన సమయంలో చూపించారని తెలిపారు. ఈ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున 5 అంశాలను లేవనెత్తారు ఏఎస్జీ.
ఆ 5 అంశాలు:
క్షేత్రస్థాయిలో పనిచేసే వారికంటే.. ఆ ప్రణాళికకు కారకులైన మేధావులు అత్యంత ప్రమాదకరం. వాస్తవానికి సీఏఏ నిరసన అనేది ఒక అపోహ మాత్రమే. పాలనలో మార్పు, ఆర్థిక సంక్షేమాన్ని అణగదొక్కడం దాని వెనకున్న అసలు ఉద్దేశం.
డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంలో.. దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నారని, తద్వారా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడమే వారి లక్ష్యమని పేర్కొన్నారు. ఇటీవల ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనే దీనికి నిదర్శనమన్నారు.
సీఏఏలో భాగంగా పలువురు ముస్లింల మద్దతుతో వారిని తప్పుదారి పట్టించేందుకు ఒక అవకాశంగా భావించారని తెలిపారు. ఢిల్లీకి నిత్యావసర వస్తువుల సరఫరా ఆపేస్తామన్న షార్జిల్ ఇమామ్ మాటలు.. ఉపా(UAPA) చట్టంలోని ఆర్థిక భద్రత కిందకు వస్తాయని రాజు వివరించారు.
షార్జిల్ ఇమామ్.. కశ్మీర్‌లో ఆర్టికల్-370 గురించి మాట్లాడుతూ ముస్లిం ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తూనే..కోర్టునూ దూషించాడని, బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్ వంటివి అందులో భాగమేనని ఏఎస్జీ చెప్పగా.. దానికి బార్, బెంచ్ రాజుకు మద్దతు పలికింది.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అతడు(షార్జిల్ ఇమామ్).. వృత్తి సంబంధిత పనుల్లో కాకుండా దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో తలదూర్చుతున్నాడని ఆయన కోర్టుకు చెప్పారు.
ఏఎస్జీ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. ఈ కేసుపై శుక్రవారం తదుపరి విచారణ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.
నాడు ఏం జరిగిందంటే.?
2020 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్లలో 53 మంది మృతిచెందారు. సుమారు 700 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారకులుగా ఆరోపిస్తూ.. ఖలీద్, ఇమామ్, జి.ఫాతిమా, మీరాన్ హైదర్, రెహ్మాన్‌లపై ఉగ్రవాద నిరోథక చట్టం(UAPA) సహా గతంలోని ఐపీసీ నిబంధనల కింద కేసు నమోదైంది. పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌరుల రిజిస్టర్(NRC)లకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల హింస చెలరేగిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: