Ten Missing from Al Falah: అల్ ఫలాహ్ నుంచి 10 మంది పరారీ
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:31 AM
ఫరీదాబాద్ జైషే మహ్మద్ ఉగ్ర మాడ్యూల్‌కు స్థావరంగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ, దాని సమీప గ్రామం నుంచి 10 మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడి జరిగినప్పటి నుంచి వీరి ఆచూకీ లభించటం లేదని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి....
వారికోసం గాలిస్తున్న దర్యాప్తు సంస్థలు
వర్సిటీ వ్యవస్థాపకుడు సిద్దిఖీకి 13 రోజుల రిమాండ్
న్యూఢిల్లీ, నవంబరు 19: ఫరీదాబాద్ జైషే మహ్మద్ ఉగ్ర మాడ్యూల్‌కు స్థావరంగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ, దాని సమీప గ్రామం నుంచి 10 మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడి జరిగినప్పటి నుంచి వీరి ఆచూకీ లభించటం లేదని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. అజ్ఞాతంలోకి వెళ్లినవారిలో వర్సిటీ బోధనా సిబ్బందితోపాటు పలువురు విద్యార్థులు, సమీప గ్రామస్తులు ఉన్నట్లు వెల్లడించాయి. వీలైనంత త్వరగా వీరిని వెతికి పట్టుకోవాలని హరియాణా పోలీసులకు ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ ఆదేశాలు జారీచేశారు. వీరికి ఫరీదాబాద్ ఉగ్ర వైద్యుల ముఠాతో సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, భారత్‌లో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ విరాళాలు సేకరించినట్లు వెల్లడైంది. పాక్‌కు చెందిన ‘సదా’ యాప్ ద్వారా ఈ విరాళాలు సేకరించినట్లు గుర్తించారు. మరింత మంది ఆత్మాహుతి బాంబర్లను తయారుచేసేందుకు ఒక్కొక్కరు రూ.20,000 పాకిస్థానీ రూపాయలు ఇవ్వాలని జైషే మహ్మద్ సంస్థ పెద్దలు పాక్‌లో పిలుపునిచ్చినట్లు పోలీసుల అదుపులో ఉన్న అల్ ఫలాహ్ వైద్యురాలు షాహీన్ వెల్లడించినట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. కాగా, ఢిల్లీ బాంబు దాడిపై వార్తలు ప్రసారం చేసేటప్పుడు స్వీయ నియంత్రణ, విచక్షణ పాటించాలని టీవీ చానళ్లకు కేంద్ర ప్రసార శాఖ సూచించింది. కొన్ని చానళ్లు ఈ దాడిని సమర్థించేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయని, బాంబులు ఎలా తయారు చేయాలనే అంశాలను కూడా చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేసింది.ఇలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని కోరింది.
అల్ ఫలా్‌హలో రూ.415 కోట్ల అక్రమాలు
అల్ ఫలాహ్ యూనివర్సిటీ యాజమాన్యం 2014-15 నుంచి 2024-25 వరకు అక్రమంగా రూ.415 కోట్లు సంపాదించిందని అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దిఖీ రిమాండ్ రిపోర్టులో ఈడీ కోర్టుకు తెలిపింది. వర్సిటీకి గుర్తింపు రాకముందే నకిలీ గుర్తింపుతో విద్యార్థులను చేర్చుకొని భారీగా ఫీజులు వసూలు చేసిందని, వాటిని విరాళాలుగా లెక్కల్లో చూపిందని వెల్లడించింది. ఈ అంశంలో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు సిద్దిఖీని తమకు అప్పగించాలని కోరింది. దీంతో ఆయనను కోర్టు 13 రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇదిలా ఉండగా, ఎర్రకోట వద్ద కారుబాంబు దాడికి పాల్పడిన ఉమర్ నబీ.. కారులోనే బాంబును అసెంబుల్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడు దాడికి ముందు ఎర్రకోట పార్కింగ్ కాంప్లెక్స్‌లో మూడు గంటలపాటు ఉన్నట్లు సీసీకెమెరాల్లో రికార్డయ్యింది. ఆ సమయంలో ఒక్కసారి కూడా అతడు కారు దిగలేదు. ఆ మూడు గంటలు అతడు విడిభాగాలను కలిపి బాంబును తయారుచేశాడని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
పాక్ నేత ప్రేలాపనలు
ఎర్రకోట బాంబు దాడిపై పాకిస్థాన్‌కు చెందిన రాజకీయ నాయకుడు చౌదరి అన్వరుల్ హక్ అవాకులు చెవాకులు పేలాడు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మీరు బలూచిస్థాన్‌లో రక్తపుటేరులు పారిస్తే, మేము ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు దాడులు చేస్తామని నేను గతంలోనే చెప్పాను. మన యోధులు ఆ పని చేసి చూపారు. వాళ్లు (భారత్) ఇప్పటికీ శవాలను లెక్కబెట్టుకోలేకపోతున్నారు’ అని పేర్కొన్నాడు.
పాక్, బంగ్లాదేశ్, యూఏఈ, చైనాల్లో వైద్య విద్య అభ్యసించిన వారిపై దృష్టి
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఇటీవల కారు పేలుడు సంభవించడం, దీని వెనుక కొందరు వైద్యుల హస్తం ఉందని గుర్తించిన కేంద్రదర్యాప్తు సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూఏఈలలో వైద్య విద్య అభ్యసించిన వారిని విచారించాలని, నిఘా పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆయా దేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారికి డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ పరిజ్ఞానం ఉందా?.. ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారించనున్నాయి. సీబీఐ, ఢిల్లీ పోలీసులు సహా ఎన్‌ఐఏ అధికారులు ఇప్పటికే చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూఏఈలలో వైద్య విద్య అభ్యసించిన వారి వివరాలను కొంత మేరకు సేకరించారు. అదేవిధంగా అన్ని వైద్యశాలలు, నర్సింగ్ హోమ్‌లు మరిన్ని వివరాలను అందించాలని కోరినట్టు దర్యాప్తు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఆయా దేశాల్లో వైద్య పట్టాలు పొందిన వారి ప్రవర్తన, అందిస్తున్న సేవలు వంటివాటిని తమకు అత్యవసరంగా ఇవ్వాలని ఆయా సంస్థలను కోరినట్టు చెప్పారు. ‘‘ఆ నాలుగు దేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారి నేర చరిత్ర, వారి ఆర్థిక లావాదేవీలను కూడా నిశితంగా పరిశీలిస్తాం’’ అని సదరు అధికారి చెప్పారు.