Delhi Assembly Elections: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ
ABN , Publish Date - Jan 30 , 2025 | 08:12 PM
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో ఆ పార్టీ దూకుడు పెంచింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. గురువారం పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

న్యూఢిల్లీ, జనవరి 30: మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ.. తన దూకుడును పెంచింది. బుధవారం షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై నిప్పులు చెరిగారు.
Also Read: జియో సిమ్ వాడుతున్నారా.. ఆ రెండు ప్లాన్స్ గోవిందా..
అవినీతిని తొలగిస్తామంటూ అధికారంలోకి వచ్చి.. వేలాది కోట్ల రూపాయిల కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఉల్లంఘించే పార్టీ ఆప్ అని ఆయన అభివర్ణించారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నదిలో విషం కలిపిందంటూ కేజ్రీవాల్ విష ప్రచారం చేశారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీతో కేజ్రీవాల్ పొత్తు పెట్టుకున్నారని చెప్పారు.
Also Read: హెలికాప్టర్, విమానం ఢీ.. 28 మృతదేహాలు వెలికితీత
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలవుతోందని కేజ్రీవాల్ ముందే గ్రహించారన్నారు. అందుకే యమునా నదిని విషపూరితం చేసిందంటూ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో యమునా నదిని శుద్ది చేయడానికి వినియోగించాల్సిన నగదును అవినీతికి ఉపయోగించారన్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ పార్టీని అధికారంలో నుంచి దించాలంటూ ప్రజలకు ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉద్బోధించారు.
Also Read: నెలల తరబడి ఇంటికి వెళ్లని ఆ ఉద్యోగులు.. రిలీజ్ ఎప్పుడంటే..?
ఎన్నికల్లో తన పార్టీకి ఓటమి తప్పదని గ్రహించే.. కేజ్రీవాల్ ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం.. యుమనా నది నీటిని కలుషితం చేసి.. వాటిని ప్రజల చేత బలవంతంగా తాగించిందన్నారు.
Also Read: కేజ్రీవాల్ ఇరికించాలనుకొని.. ఇరుక్కుపోయారా?
ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఎన్నికల పోలింగ్‌లో బీజేపీకి ఓటు వేయడం ద్వారా ఆప్‌ను అధికారం నుంచి దింపాలంటూ ప్రజలకు ఆయన సూచించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఢిల్లీని దేశంలో నెంబర్ వన్ రాజధానిగా చేస్తామని దేశ రాజధాని ప్రజలకు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.
Also Read: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పిబ్రవరి 5వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లలో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. 2013 నుంచి ఆప్ వరుసగా విజయం సాధిస్తు వస్తుంది. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పాలనకు చరమ గీతం పాడేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. మరి ఢిల్లీ ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టాడనేది తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 8వ తేదీ వరకు వేచి చూడాలన్నది సుస్పష్టం.
For National News And Telugu News