Political Developments In Bihar: బిహార్‌లో మహాకూటమిలో చీలిక
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:58 AM
బిహార్ మహాకూటమిలో విభేదాలు నెలకొన్నట్లు కనిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో ఆ కూటమిలోని రెండేసి పార్టీలు అభ్యర్థులను....
పట్నా, అక్టోబరు 21: బిహార్ మహాకూటమిలో విభేదాలు నెలకొన్నట్లు కనిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో ఆ కూటమిలోని రెండేసి పార్టీలు అభ్యర్థులను నెలబట్టడమే ఈ అభిప్రాయానికి కారణం. ఆర్జేడీ,కాంగ్రెస్ ఆరు సీట్లలో ముఖాముఖి తలపడుతుండగా.. సీపీఐ, కాంగ్రెస్ నాలుగు సీట్లలో పోటీ పడుతున్నాయి. ముకేశ్ సహాని వికాస్ శీల్ ఇన్‌సాన్ పార్టీ, ఆర్జేడీ రెండు సీట్లలో తలపడుతున్నాయి. సోమవారం ఆర్జేడీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో(143 సీట్లకు) ఈ విషయం స్పష్టమైంది. ఈ జాబితాలో కాంగ్రెస్ పోటీ చేస్తోన్న ఆరు సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఈ స్నేహపూర్వక పోటీల వల్ల ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి ఎన్డీయే లబ్ధి పొందుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా బిహార్‌లో రెండో దశ పోలింగ్‌కు కూడా సోమవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. నవంబరు 6న ఎన్నికలు నిర్వహించనున్న మొదటి దశలో 121 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 1,314 మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా బిహార్ ఎన్నికల్లో ఆరు సీట్లలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించిన జార్ఖండ్ ముక్తి మోర్చా తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తమ మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ రాజకీయ కుట్ర కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్‌లో తమ మూడు పార్టీల కూటమిపై సమీక్షిస్తామని, ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.