Mallikarjun Kharge: శశిథరూర్‌పై ఖర్గే పరోక్ష విమర్శలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:59 PM
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని మోదీపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ పలుమార్లు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు.
న్యూఢిల్లీ, జూన్ 25: ప్రధాని నరేంద్ర మోదీపై తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించడంపై ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అలాంటి వేళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఆ క్రమంలో శశిథరూర్‌పై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ముందు దేశం ముఖ్యమని.. ఆ తర్వాతే మిగిలినవన్నీ అని స్పష్టం చేశారు. కానీ కొంత మందికి మాత్రం ముందు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమని.. ఆ తర్వాతే దేశమని ఖర్గే వ్యంగ్యంగా అన్నారు.
బుధవారం న్యూఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్‌పై చర్యలు ఏమైనా తీసుకుంటారా? అని ప్రశ్నకు ఏమీ లేదని ఆయన సూచన ప్రాయంగా తెలిపారు. అయితే తనకు ఇంగ్లీష్ భాషపై అంతగా పట్టులేదన్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ భాషపై బాగా పట్టున్న శశిథరూర్‌ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) లో సభ్యుడిగా తీసుకున్నట్లు వివరించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ తాము, తమ సైన్యం.. సైనికులు, ఆపరేషన్ సిందూర్‌తో ఉన్నామని స్పష్టం చేశామని గుర్తు చేశారు. అంటే తామకు దేశం ముఖ్యమని చెప్పామన్నారు.
కానీ కొందరికి మాత్రం ముందు ప్రధాని మోదీ.. ఆ తర్వాతే దేశం అన్నట్లుగా వ్యవహరిస్తారన్నారు. దీని గురించి మనం ఏం చేయగలమంటూ ఖర్గే పెదవి విరిచారు. సీడబ్ల్యూసీలో చాలా మంది సభ్యులు ఉన్నారని.. ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందన్నారు. కానీ ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని శశిథరూర్‌ను ఉద్దేశించి ఖర్గే వ్యాఖ్యానించారు. తాము దేశాన్ని కాపాడడంపై దృష్టి పెట్టామన్నారు. ఎవరైనా దేని గురించి అయినా ఆందోళన చెందుతుంటే వాళ్ల వద్దకు వెళ్లి ప్రశ్నించాలంటూ విలేకర్లకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో అపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ సిందూర్‌పై శశిథరూర్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ వ్యవహరిస్తున్న తీరును ప్రపంచదేశాలకు తెలియజేయాలని మోదీ ప్రభుత్వం భావించింది. అందులోభాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో ఏడు బృందాలను ఎంపిక చేసింది.
అందులో ఒక బృందానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ సారథ్యం వహించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అలాగే ఇటీవల అంగ్ల పత్రికలో శశిథరూర్ ఒక వ్యాసం రాశారు. అందులో ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. అదే విధంగా ప్రధాని మోదీ కేరళ పర్యటన చేశారు. ఆ సమయంలో ఆయన వెంట శశిథరూర్ ఉన్నారు. ఇక మోదీ కేబినెట్‌లోని పలువురు మంత్రులతో శశిథరూర్ సెల్పీలు దిగారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ వివిధ సందర్భాల్లో స్పందించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి తనకు మధ్య కొంత గ్యాప్ ఉన్న మాట వాస్తవమని శశిథరూన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుపై బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంసలు
గదిలోకి కత్తితో వెళ్లిన నవ వధువు.. కంగుతిన్న వరుడు
For National News And Telugu News