Big Twist in Delhi Result: టార్గెట్ రీచ్.. ఆ విషయంలో ఢిల్లీలో గెలిచిన కాంగ్రెస్.. అసలు విషయం ఏమిటంటే..?
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:51 PM
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తది దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాల సరళి చూస్తే బీజేపీ మెజార్టీ మార్క్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఓటర్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ విజయం సాధించనప్పటికీ.. ఒక విషయంలో మాత్రం ఆ పార్టీ విజయం సాధించింది.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఓట్ల పరంగా మూడోస్థానానికి పరిమితమైన ఆ పార్టీ ఒక విషయంలో మాత్రం టార్గెట్ రీచ్ అయినట్లు చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్.. శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసింది. మరోవైపు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఎస్పీ, టీఎంసీ సహా మరికొన్ని పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలో ఆప్ గెలిస్తే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ లేని మరో కూటమిని ఏర్పాటు చేసి, లీడ్ చేయాలనే ఆలోచన కేజ్రీవాల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆప్ ఢిల్లీలో గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు మరింత ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని గ్రహించిన కాంగ్రెస్.. తాము గెలవకపోయినా, ఆప్ ఓడిపోవాలనే లక్ష్యంతో పనిచేసినట్లు తెలుస్తోంది. ఆప్ ఓడిపోతే కేజ్రీవాల్‌తో పాటు మిగిలిన ఇండియా కూటమిలోని పక్షాలు కాంగ్రెస్ నేతృత్వంలో నడిచే అవకాశం ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోకపోయినా ఆప్‌ను ఓడించాలనే విషయంలో మాత్రం కాంగ్రెస్ గెలిచినట్లు ప్రచారం జరుగుతోంది.
కలిసి పోటీ చేద్దామనుకున్నా..
లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేయడంతో, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయని అంతా భావించారు. హర్యానా ఎన్నికల్లో తాము అడిగిన సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో.. ఢిల్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని కేజ్రీవాల్ ప్రకటించారు. పొత్తు ఉంటే బాగుంటుందనే చర్చ రెండు పార్టీల నాయకులు భావించినప్పటికీ కేజ్రీవాల్ మొండిపట్టు, ఏకపక్ష నిర్ణయం కారణంగా ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీచేశాయి. కాంగ్రెస్ పెద్దగా ఓట్లు సాధించనప్పటికీ స్వల్ప మెజార్టీతో బీజేపీ గెలిచిన స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ కారణంగా ఆప్‌కు నష్టం కలిగినట్లు ఫలితాల సరళి చూస్తే తెలుస్తోంది.
దక్కని డిపాజిట్లు
కాంగ్రెస్ పోటీచేసిన 70 స్థానాలకు గానూ రెండు నుంచి మూడు మినహా మిగతా స్థానాల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పోటీచేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కనీసం 5వేల ఓట్లు దాటని పరిస్థితి నెలకొంది. ఫలితాల సరళి చూస్తే పోటీ ఆప్, బీజేపీ మధ్యనే సాగినట్లు కనిపిస్తోంది. సంప్రదాయ ఓటర్లు తప్పితే మిగతా ఓటర్లు ఆప్ లేదా బీజేపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకున్నప్పటికీ.. ఆప్‌ను ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ విజయం సాధించినట్లు చెప్పుకోవాలి. ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేసి ఉంటే తప్పకుండా మరింత టఫ్ ఫైట్ ఉండేదనే చర్చ జరుగుతోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here