Share News

CEC on Bihar Polls: ఈవీఎంలపై పెద్దగా సీరియల్ నెంబర్లు, కలర్ ఫోటోలు.. సీఈసీ వెల్లడి

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:01 PM

ఎలక్షన్ కమిషన్ టీమ్ మొత్తం రెండ్రోజులుగా బిహార్‌లోనే ఉందని, రాష్ట్ర పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధిపతులు, నోడల్ అధికారులతో సమావేశాలను నిర్వహించామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.

CEC on Bihar Polls: ఈవీఎంలపై పెద్దగా సీరియల్ నెంబర్లు, కలర్ ఫోటోలు.. సీఈసీ వెల్లడి
CEC Gyanesh Kumar

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly elections) దగ్గరపడుతుండటంతో ఎన్నికల కమిషన్ (Election Commission) చురుకుగా సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం నాడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించగా.. ఆదివారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో పాట్నాలో ఎన్నికల కమిషన్ సమావేశమైంది. అనంతరం ఎన్నికల సన్నద్ధతపై మీడియాకు వివరాలు తెలియజేసింది.


వరుస సమావేశాలు

ఆదాయం పన్ను శాఖ, పోలీసు శాఖ, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో ఎన్నికల కమిషన్ ఆదివారం నాడు సమావేశమైంది. స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ పథకంపై సమీక్ష జరిపింది. అనంతరం చీఫ్ ఎలక్టోరల్ అధికారులు, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రతినిధులతో సమావేశమైంది. ఆ వెంటనే చీఫ్ సెక్రటరీ, డెరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇతర బ్యూరోక్రాట్లతో రాష్ట్రస్థాయిలో సమన్వయంపై సమీక్ష జరిపింది.


ఓట్ల పండుగను విజయవంతం చేయండి

బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 22వ తేదీలోగా ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎలక్షన్ కమిషన్ టీమ్ మొత్తం రెండ్రోజులుగా బిహార్‌లోనే ఉందని, రాష్ట్ర పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధిపతులు, నోడల్ అధికారులతో సమావేశాలను నిర్వహించామని చెప్పారు. ఛాత్ పండుగను ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో అంతే ఉత్సాహంతో బిహార్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు.


బిహార్ ఎన్నికల నుంచే..

ఈవీఎంలపై సీరియల్ నెంబర్ ఫాంట్ పెద్దదిగా, అభ్యర్థుల ఫొటోలు కలర్‌లో ఉంటాయని, ఈ ప్రక్రియ బిహార్ ఎన్నికల నుంచే మొదలవుతోందని చెప్పారు. ఈవీఎంలలో బ్యాలెట్ పెపర్ ఇన్‌సర్ట్ చేసినప్పుడు ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటే గుర్తించడం కష్టమవుతోందని, ఎన్నికల గుర్తుల విషయమూ అంతేనని అన్నారు. ఈసారి నుంచి దేశవ్యాప్తంగా సీరియల్ నెంబర్ ఫాంట్లు పెద్దవిగా ఉండేలా, అభ్యర్థుల ఫొటోలు కలర్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


ఒకటి లేదా రెండు దశల్లో..

కాగా, ఎన్నికల కమిషన్‌తో జరిపిన సమావేశంలో బిహార్ ఎన్నికలు ఒకటి లేదా రెండు విడతల్లో పూర్తి చేయాలని వివిధ పార్టీలు కోరాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని నితీష్ సారథ్యంలోని జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) కోరగా.. జేడీయూ భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ ఒకటి లేదా రెండు దశల్లో ఎన్నికలు జరపాలని సూచించింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ ఒకటి లేదా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత తెలిపింది.


ఇవి కూడా చదవండి..

లెహ్ నిరసనకారుల మృతిపై న్యాయవిచారణకు వాంగ్‌చుక్ డిమాండ్

డార్జిలింగ్‌లో కొండచరియల బీభత్సం.. 17 మందికి చేరిన మృతులు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2025 | 06:11 PM