Share News

CM Stalin: కరూర్‌ దుర్ఘటనకు కారణం విజయ్‌ ఆలస్యమే..

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:19 PM

కరూర్‌లో ‘తమిళగ వెట్టి కళగం’ (టీవీకే) రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందటానికి ఆ పార్టీ నాయకుడు ఏడు గంటలు ఆలస్యంగా రావటమే కారణమని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు.

CM Stalin: కరూర్‌ దుర్ఘటనకు కారణం విజయ్‌ ఆలస్యమే..

- చెప్పిన సమయం కన్నా 7 గంటలు లేటు ఫ ఎక్కడా భద్రతా లోపాలు లేవు

- పోలీసు హెచ్చరికలు బేఖాతరు

- శాసనసభలో సీఎం స్టాలిన్‌ ప్రకటన

చెన్నై: కరూర్‌లో ‘తమిళగ వెట్టి కళగం’ (టీవీకే) రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందటానికి ఆ పార్టీ నాయకుడు ఏడు గంటలు ఆలస్యంగా రావటమే కారణమని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. కరూరులో జరిగిన దుర్ఘటన రాష్ట్రంలోని ప్రజలందరినీ దిగ్ర్భాంతికి గురిచేసిందని, ఆ దుర్ఘటనలో మృతిచెందిన 41 మంది కుటుంబాలకు సభాముఖంగా తన ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నానన్నారు. కరూర్‌లో రోడ్‌షో జరిపేందుకు టీవీకే స్థానిక నాయకులు ముందుగా అడిగిన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బంది అధికంగా ఉంటుందనే పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిపారు.


సెప్టెంబర్‌ 25న లైట్‌హౌస్‌ కార్నర్‌, ఉళవర్‌ సంత (రైతు బజార్‌) ప్రాంతాల్లో రోడ్‌ షోకు అనుమతి కోరారని, ఆ ప్రాంతాల్లో భద్రత కల్పించడం కష్టమని పోలీసులు అనుమతి నిరాకరించారని చెప్పారు. చివరకు టీవీకే కరూర్‌ వెస్ట్‌ జిల్లా కార్యదర్శి కోరిక మేరకు 11 నిబంధనలతో వేలుచ్చామిపురం వద్ద రోడ్‌షోకు అనుమతించినట్లు చెప్పారు. కరూర్‌ రోడ్‌షోకు పటిష్టమైన భద్రత కల్పించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, రెండు రోజుల క్రితం అక్కడ అన్నాడీఎంకే నేత ఈపీఎస్‌ రోడ్‌షో ప్రశాంతంగా ముగిసిందని, ఆ రోడ్‌షోకు సుమారు 300 మంది పోలీసులతో భద్రత కల్పించామని గుర్తు చేశారు. అదే సమయంలో సెప్టెంబర్‌ 27 రాత్రి జరిగిన టీవీకే రోడ్‌షో సందర్భంగా కరూరు జిల్లా ఎస్పీ నాయకత్వంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని,


nani2.2.jpg

ముగ్గురు ఎస్సీలు, ఐదుగురు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలు, సాయుధ దళాలు సహా 5 వందల మందికి పైగా పోలీసులతో బందోబస్తు కల్పించినట్టు తెలిపారు. అంతే కాకుండా పొరుగు జిల్లాల నుండి ఓ ఎస్పీ. ఇద్దరు సీఐలు, 89 మంది ఎస్‌ఐలు, 60 మంది సాయుధ దళ కానిస్టేబుళ్లు, టాస్క్‌ఫోర్స్‌కు చెందిన 20 మంది కానిస్టేబుళ్లు సహా 91 మందితో భద్రతను పెంచామని స్టాలిన్‌ వివరించారు. రోడ్‌షోకు సుమారు 10 వేల మంది దాకా వస్తారని టీవీకే నిర్వాహకులు పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారని, అయితే టీవీకే నేత ప్రయాణించిన వాహనాన్ని వెంబడిస్తూ వేల సంఖ్యలో జనాలు వేలుచ్చామిపురం చేరుకోవటంతో తొక్కిసలాట జరిగాయని వివరించారు.


పొంతనలేని ప్రకటనలు...

పార్టీ నాయకులు టీవీకే నేత సెప్టెంబర్‌ 27 మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10లోగా రోడ్‌షోలో పాల్గొంటారని అధికారికంగా ప్రకటించారని, కానీ ఆ తరువాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మధ్యాహ్నం 12 గంటలకే విజయ్‌ వేలుచ్చామిపురానికి రానున్నారని మీడియా సమావేశంలో ప్రకటించడంతో ఉదయం పది గంటల నుండే ఆ ప్రాంతంలో రద్దీ అధికమైందన్నారు. పార్టీ నేత చెన్నై నుంచి ఉదయం 8.40 గంటలకు బయలుదేరి ఉదయం 9.25 గంటలకు తిరుచ్చి చేరుకున్నారని, అక్కడి నుండి బయలుదేరి నామక్కల్‌ రోడ్‌షోలో పాల్గొని రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాతే కరూరుకు వచ్చారని, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన రోడ్‌షో ఏడు గంటలు ఆలస్యంగా జరిగిందన్నారు.


nani2.3.jpg

ఈ తీవ్రమైన జాప్యమే తొక్కిసలాటకు దారితీసిందని పేర్కొన్నారు. టీవీకే నేత తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించారని వారికి సెల్యూట్‌ చేసిన తర్వాత జనాన్ని ఉద్దేశించి మాట్లాడారన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ రోడ్‌షో జరిపినా ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడం ఆనవాయితీ అని, కరూర్‌లో టీవీకే నిర్వాహకులు ఉదయం 10 నుంచి గుమికూడిన ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించలేదని,ఆహారం పంపిణీ చేయలేదని, మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయలేదని, అందువలనే మహిళలు ఆ చోట నుండి కదల్లేని పరిస్థితి ఏర్పడిందన్నారు.


టీవీకే రోడ్‌షోకు ముందు అదే ప్రాం తంలో ఈపీఎస్‌ పాల్గొన్న రోడ్‌షోకు 12 వేల నుండి 15 వేల మందివరకూ హాజరయ్యారని, ఆ సభకు 137 మంది పోలీసులు, 30 మంది హోంగార్డులే భద్ర తా విధులు నిర్వర్తించారని,పార్టీ శ్రేణులు స భకు వచ్చిన వారి కి కనీస సదుపాయాలు సమకూర్చడంతో ఆ సభ ప్రశాంతంగా ముగిసిందన్నారు. కరూరు జిల్లా సరిహద్దు ప్రాంతం తవిట్టుపాళయం చెక్‌పోస్ట్‌ ప్రాంతం వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొని టీవీకే నేత క్యారవ్యాన్‌లో బయలుదేరినప్పుడు ఆ వాహనాన్ని వేలాదిమంది వెంబడించారని, విపరీతమైన జనం రావడంతో స్థానిక పోలీసు అధికారులు వేలుచ్చామిపురానికి కాస్త ముందుగా ఉన్న అక్షయా ఆస్పత్రి వద్ద వాహనాన్ని నిలిపి ప్రసంగించాలని సూచించారన్నారు.


nani2.4.jpg

అయితే పార్టీ నాయకులు వేలుచ్చామిపురం వద్దే సభ జరుపుతామని పట్టుబట్టారని స్టాలిన్‌ ఆరోపించారు. పోలీసుల హెచ్చరిక పట్టించుకోకుండా అక్షయా ఆస్పత్రి నుండి 35 మీటర్ల దూరం వరకు ప్రచార వాహనం వెళ్లడంతో దానికి ఇరువైపులా విపరీతమైన జనం చేరి తొక్కిసలాట ప్రారంభమైందన్నారు. మహిళలు, చిన్నారులు, వద్ధులు సొమ్మసిల్లి పడిపోయారని ఈ కారణంగానే పలువురు మృతి చెందారని సీఎం వివరించారు. తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో కరూర్‌ దుర్ఘటనలాంటి ప్రమాదాలను ఎన్నడూ చూడలేదన్నారు. కరూర్‌ దుర్ఘటనపై తప్పుడు సమాచారం, వీడియోలను సోషల్‌మీడియాలో వెలువరించడంతో వాస్తవాలను ఐఏఎస్‌ అధికారుల ద్వారా వీడియో ఆధారాలతో ప్రజలకు తెలియజేశానని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా

వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2025 | 12:21 PM